Rahul Gandhi: సీఈసీ ఎంపికలో విభేదాల సందిగ్ధం.. రాహుల్ కు బిగ్ షాక్!

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎంపిక ప్రక్రియ కొత్త చర్చలకు దారితీసింది. మంగళవారం పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ కుమార్ స్థానాన్ని భర్తీ చేసేందుకు హై లెవెల్ కమిటీ సమావేశమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ ను సీఈసీగా నియమించాలని మోదీ ప్రతిపాదించారు. అమిత్ షా దీనికి మద్దతు ఇచ్చినా, రాహుల్ గాంధీ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.

సుప్రీంకోర్టులో సీఈసీ నియామక వ్యవహారం విచారణలో ఉన్నందున నిర్ణయం తీసుకోవడం తగదని రాహుల్ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు వచ్చేంతవరకు నియామక ప్రక్రియను నిలిపివేయాలని సూచించారు. అంతేకాకుండా, అధికార పక్షం ప్రతిపక్షంతో కలసికట్టుగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, మిగిలిన ఇద్దరి ఆమోదంతో జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా, వివేక్ జోషి ఎన్నికల కమిషనర్‌గా ఎంపికయ్యారు.

ఈ నియామకాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోద ముద్ర వేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జరిగిన ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం ప్రస్తావనలో ఉన్నా, కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం వల్ల కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు.

ప్రధాన ప్రతిపక్షంతో కలిసి సీఈసీ నియామక ప్రక్రియ నిర్వహిస్తే ప్రజాస్వామ్య విలువలకు తగినట్టు ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, మోదీ, అమిత్ షా కలిసి తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ వైఖరిని స్పష్టంగా తెలియజేసిందన్న విశ్లేషణ వెలువడుతోంది. రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ చర్చకు దారి తీస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్లేట్‌ ఫిరాయించిన మార్గదర్శి | Margadarsi Chit Fund Scam Case | Ramoji Rao | RBI | Telugu Rajyam