ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా ప్రభుత్వం నిర్వహించే సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ (ఎస్ఎస్ఏ) పై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్ఎస్ఏ లబ్ధిదారుల జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయంటూ ట్వీట్ చేస్తూ, ఏకంగా 360 ఏళ్లుగా ఓ వ్యక్తికి ఆర్థిక సహాయం అందుతోందని ఎద్దేవా చేశారు. ఆయన వెల్లడి ప్రకారం, ఈ జాబితాలో 100-200 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.30 కోట్లు, 200 ఏళ్లు పైబడిన వారు 2,000 మంది ఉన్నారని పేర్కొన్నారు. జనాభా కంటే ఎక్కువ మంది ఎస్ఎస్ఏ లబ్ధిదారులుగా ఉండడం చరిత్రలోనే అతిపెద్ద మోసమని మస్క్ ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఖర్చులను సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) కు మస్క్ చీఫ్‌గా నియమితులయ్యారు. తాజాగా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌తో డోజ్‌కు అనుమతి లభించడంతో ప్రభుత్వ చెల్లింపులను పరిశీలించే అవకాశం వచ్చింది. అందులో భాగంగానే మస్క్ కార్యవర్గం ఎస్ఎస్ఏ లిస్టుపై దృష్టిపెట్టింది. అనర్హుల పేర్లు, మృతి చెందిన వారి ఖాతాలు ఇప్పటికీ చెల్లింపుల లిస్టులో ఉండడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మస్క్ తెలిపారు.
అయితే, మస్క్ ఆరోపణలను ఎస్ఎస్ఏ అధికారులు పూర్తిగా కొట్టిపారేశారు. లిస్టులో ఉన్న వందేళ్లు పైబడిన వారెవరూ ప్రభుత్వ సాయాన్ని అందుకోవడం లేదని, వారి పేర్లు కేవలం పాత డేటాబేస్‌లోనే ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఎస్ఎస్ఏ చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని, అధికారిక లెక్కలన్నీ సరిగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
అమెరికా ప్రభుత్వం పదవీ విరమణ పొందినవారికి, అంగవైకల్యం ఉన్న వారికి, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మద్దతుగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అందజేస్తుంది. ఈ పథకం ద్వారా నగదు సహాయం, ఆహార కూపన్లు వంటి ప్రయోజనాలు అందిస్తారు. కానీ, మస్క్ చేసిన ఈ ఆరోపణలు వాస్తవమేనా? లేదంటే కేవలం ఓ లెక్కల గందరగోళమా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.