Delhi CM: ఢిల్లీ సీఎం కుర్చీ కోసం బీజేపీలో టెన్షన్ పీక్

27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో పునరాగమనం సాధించినా, కొత్త ప్రభుత్వం ఏర్పాటులో మరింత ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5న వెలువడినా, ఇప్పటివరకు సీఎం ఎంపికపై స్పష్టత రాలేదు. కేంద్రం మరియు రాష్ట్రం ఒకే పార్టీ ఆధీనంలో ఉన్నందున క్షణాల్లో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనుకున్న అంచనాలు తప్పాయి. సీఎం పదవికి పోటీదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన రాకకు ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకమైన కసరత్తును పూర్తి చేసినట్లు సమాచారం. సీఎం పదవికి 15 మంది అభ్యర్థులతో ఒక జాబితాను తయారుచేసి, దానిని 9 మందితో కూడిన షార్ట్ లిస్ట్‌గా మార్చారు. ఈ 9 మందిలోనే సీఎం, అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మరియు కీలక మంత్రుల పదవులు ఖరారయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

మోదీ శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న వెంటనే సీఎం ఎంపికపై తుది చర్చలు ప్రారంభమవుతాయని సమాచారం. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తోంది. సీఎం పఠవీతోపాటు, మంత్రివర్గ సభ్యుల గురించి కూడా ఈ సమావేశంలో స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 19 లేదా 20వ తేదీన నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక, ఆ 9 మందిలో ఎవరు లక్కీ లీడర్ అవుతారనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే, ఢిల్లీ సీఎం పదవి భాజపా చరిత్రలో కీలకమని, ఈ ఎంపిక భవిష్యత్తులో పార్టీ రాజకీయాలకు కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఆదేశాలతో తుది నిర్ణయం రావడం ఆలస్యమైనా, బీజేపీ ఈసారి ఎలాంటి పొరపాట్లు చేయకుండా కచ్చితమైన వ్యూహంతో ముందుకు సాగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Laila Movie Controversy : కన్నీళ్లు పెట్టుకున్న విశ్వక్ తండ్రి | Viswaksen Father Emotional | TR