Kesineni Nani: గతేడాది ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని, ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే, తాజా ఊహాగానాలు ఆయనను మళ్లీ వార్తల్లో నిలిపాయి. మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి.
నాని, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో, వైసీపీలోకి తిరిగి చేరేందుకు నాని ప్రయత్నిస్తున్నారని, ఆయనకు జగన్‌తో మంచి అనుబంధం ఉందని వైసీపీ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి.
అయితే, ఈ ప్రచారాలపై కేశినేని నాని స్వయంగా స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చిన నాని, గతేడాది జూన్ 10న అధికారికంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించానని, ఆ నిర్ణయం ఇప్పటికీ మారలేదని స్పష్టం చేశారు. ప్రజాసేవకోసం రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను గట్టిగా నమ్ముతానని అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే తన అసలైన లక్ష్యమని తెలిపారు.
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే తన ప్రధాన దృష్టి అని, పదవి లేకపోయినా వారికి సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నాని పేర్కొన్నారు. తనపై వచ్చే నిరాధార ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “నా తోటి విజయవాడ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. నా రాజకీయ పునరాగమనంపై అసత్య వార్తలను విస్మరించండి” అని స్పష్టం చేశారు.