Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో మాతృభూమికి తిరిగి వస్తానని ప్రకటించారు. దేశంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా, ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. దేశాన్ని ఉగ్రవాద ప్రభుత్వం పాలిస్తోందని, మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జూమ్ కాల్ ద్వారా పాల్గొన్న హసీనా, తన పార్టీ శ్రేణులకు ఓపిక పాటించాలని సూచించారు.
తన పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, పోలీసు అధికారులపై జరిగిన దాడులను హసీనా గుర్తు చేశారు. జులై-ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, కానీ ప్రభుత్వం బాధ్యులను శిక్షించలేదని విమర్శించారు. విచారణ కమిటీలను రద్దు చేయడం, ప్రభుత్వ భవనాలు ధ్వంసం చేయడం యూనస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఎంత కాలమైనా దేశంలో పరిస్థితి మెరుగుపడలేదని హసీనా తెలిపారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. యూనస్ ప్రభుత్వ దుర్మార్గ పాలనను అరికట్టేందుకు ప్రజలు ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలతో హసీనా మాట్లాడారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచిందీ దేశ రక్షణ కోసమేనని, త్వరలోనే తిరిగి వచ్చి న్యాయం కోసం పోరాడుతానని, అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని తెలిపారు. తన పార్టీ నేతలు, ప్రజలు ధైర్యంగా ముందుకుసాగాలని కోరారు.