పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోయింది. అంతకు ముందు రెండేళ్ళు కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి కాలేదు. పరీక్షల నిర్వహణ కూడా జరగలేదనుకోండి.. అది వేరే సంగతి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.
కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో విద్యా వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు మానసిక వేదన అనుభవించారు. వరుసగా రెండేళ్ళు పరీక్షలు రాయని విద్యార్థులు, పదో తరగతికి వచ్చాక పరీక్షలు రాస్తే, ఆ ఎఫెక్ట్ ఎలా వుంటుంది.? ఇదిగో ఇలాగే వుంటుంది.
ఈ విషయంలో ప్రభుత్వానిదే పూర్తిగా బాధ్యత అనలేం. కానీ, ప్రభుత్వానికీ కొంత బాధ్యత వుంది. ఔను, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం తగ్గడమంటే, ఆ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావమే పడుతుంది. విద్యార్థుల జీవితాలతో అన్ని రాజకీయ పార్టీలూ చెలగాటమాడాయి గత రెండేళ్ళుగా. వైసీపీ ఇందుకు మినహాయింపేమీ కాదు.
తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీషు మీడియం.. అంటూ విద్యార్థి లోకాన్ని వైఎస్ జగన్ సర్కారు అయోమయంలోకి నెట్టేసింది. నాడు – నేడు అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేసింది. విద్యా వ్యవస్థలో నియామకాల విషయంలోనూ అలసత్వం ప్రదర్శించింది. చెప్పుకుంటూ పోతే చాలానే.
మీట నొక్కి అమ్మ ఒడి పేరుతో డబ్బులు పంచితే సరిపోదు. నాడు – నేడు పేరుతో పాఠశాలలకు రంగులేస్తే సరిపోదు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందజేస్తున్నామా.? లేదా.? అన్నదానిపై వైసీపీ సర్కారు క్రాస్ చెక్ చేసుకోలేకపోయింది. ఆ ఫలితమే, పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గడం.
దీనికి నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల్నో, టీడీపీనో బాధ్యుల్ని చేయాలని వైసీపీ డిమాండ్ చేయడమంటే అంతకన్నా దారుణం ఇంకోటుండదు. మరీ, ఇంత కప్పదాటు వైఖరి ప్రభుత్వ పెద్దలు అవలంభిస్తే ఎలా.?