AP Rajya Sabha: ఏపీ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానం కోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ స్థానం వైసీపీకి చెందిన వి. విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయింది. దీంతో ఈ పదవిని భర్తీ చేయడానికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు.

నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 29వ తేదీ వరకు తమ నామినేషన్‌లను దాఖలు చేయవచ్చు. అతి తక్కువ వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేయడానికి సీఈసీ ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 30న నామినేషన్‌ల పరిశీలన జరగనుంది. మే 2వ తేదీ నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.

అన్ని ప్రక్రియలు ముగిశాక మే 9వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వెంటనే ఫలితాన్ని కూడా ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీల దృష్టి ఇప్పటినుంచే నెలకొంది. ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై అధికార, విపక్షాల్లో చర్చ మొదలైపోయింది. అధికార పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న ఉత్కంఠ నెలకొంది. అదే విధంగా ఈసారి విపక్షాలు కూడా అభ్యర్థిని ప్రకటిస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా మే 9న ఓటింగ్‌తో రాజ్యసభ స్థానం భర్తీ ప్రక్రియ ముగియనుంది.

పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త ట్విస్ట్ || Pastor Praveen Pagadala Case Final Report || Telugu Rajyam