Heart Attack: పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అటువంటి వాటిలో ఒకటి హార్ట్ ఎటాక్. దశాబ్దం క్రితం 65 నుండి 70 ఏళ్ల మధ్యలో ఎక్కువగా కనిపించే గుండెపోటు సమస్యలు ఇప్పుడు 25 నుండి 35 సంవత్సరాల యువతలో అధికంగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే యువకుల లో గుండెపోటు, ఆకస్మిక మరణాలు ఎక్కువైపోయాయి అని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, జీవనశైలి దీనికి ప్రధాన సమస్యగా అభివర్ణిస్తున్నారు. యుక్తవయస్సులో గుండెపోటు రావడానికి గల కారణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
*ధూమపానం, పొగాకు వినియోగం చేసేవారి లో హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతాయి. పొగాకు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
*అధిక బరువు ఉన్నవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయం మెల్లగా గుండె పనితీరు మీద ప్రభావం చూపుతుంది.
*మానసిక వత్తిడిని ఎక్కువగా అనుభవించే వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైన జీవితం గడపడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు.
*అధిక రక్తపోటు ఉన్నవారిలో కూడా గుండెపోటు సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు అధికమవుతున్నారు. ఇలాంటి వారికి నెమ్మదిగా వారి గుండె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
*ఇవే కాకుండా జన్యుపరమైన కారణాల వల్ల కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో ఇదివరకు ఎవరైనా గుండె పోటు సమస్యలతో మరణించినట్లయితే వారి సంతానం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
యువతరం ఆకస్మిక గుండెపోట్లు పెరిగిపోయాయి. 40 శాతం మందిలో ఎటువంటి కారణాలు తెలియకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపత్కాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేయడం వల్ల గుండె ను తిరిగి పనిచేసేలా చేయవచ్చు. దీని మీద ప్రజలలో అవగాహన పెంచి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న యువతను కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.