Game Changer: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్: మళ్ళీ గట్టిగా ఖర్చు చేస్తున్న దిల్ రాజు

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది.

అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డల్లాస్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ హాజరవుతుండగా, రామ్ చరణ్ ప్రత్యేక ర్యాలీ ద్వారా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ ఈవెంట్‌తో పాటు అక్కడి ప్రీ సేల్స్ కూడా మంచి ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు $100k కు పైగా ప్రీ సేల్స్ నంబర్స్ నమోదవ్వగా, ఈ ఈవెంట్ అనంతరం మిలియన్ మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు, దిల్ రాజు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 ప్రమోషన్ ఫార్ములాను అనుసరిస్తూ గేమ్ ఛేంజర్కు కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా, ప్రమోషన్స్ కోసం రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

శంకర్ గత చిత్రాలు కలిసిరానప్పటికీ, గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ నటన, శంకర్ టేకింగ్, అలాగే తండ్రీకొడుకుల కథాంశం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయి. రాబోయే వారాల్లో విడుదలయ్యే థియేట్రికల్ ట్రైలర్, పాటలు సినిమాకు మరింత హైప్ తీసుకురావడం ఖాయమని అంచనా. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.