తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ఒక భావోద్వేగపూరితమైన పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాట సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే ఈ పాటతో కోట్లాదిమంది హృదయాలను ద్రవింపజేసిన గాయకుడు, మానవ సంబంధాల విలువను వివరిస్తూ అద్భుతంగా పాటని ఆలపించారు. కెరియర్ మొత్తంలో ఒక సినిమాకి ఒక పాట పాడిన ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఈ గాయకుడు.
అతను మరెవరో కాదు ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి బలగం దర్శకుడు వేణు ఆర్థిక సాయం అందించారు. ఆయన మృతి పట్ల బలగం మూవీ యూనిట్ తో పాటు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా మొగిలయ్య ఆసుపత్రిలో ఉండగానే డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్పటి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్యశాల అందించాలని ప్రభుత్వం తరఫున ఆదేశించారు. అంతే కాకుండా ఇటీవల మొగిలయ్య కుటుంబానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు.
పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్న మొగులయ్య దంపతులకు ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నో ఏళ్లుగా మొగిలయ్య – తన భార్య కొమురమ్మ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బలగం సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది. ఏది ఏమైనా తన పాటతో అందరికీ కన్నీరు తెప్పించిన మొగులయ్య చివరికి అందరికీ కన్నీరు మిగిల్చి వెళ్లిపోవడం విచారకరం.