ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమాకు ఈ సంస్థ నుంచి 2.15 కోట్ల రూపాయలు చెల్లించారట. ఈ మొత్తాన్ని వ్యూస్ ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఫలితంగా, ఒక్కో వ్యూస్‌కు 11 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ తీరును విమర్శిస్తూ జీవీ రెడ్డి మాట్లాడుతూ, 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఐదు లక్షలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రజలకు అందించాల్సిన సేవలను వదిలిపెట్టి, అసంబద్ధమైన వ్యయాలు, అవకతవకల కారణంగా ప్రాజెక్ట్ దారితప్పిందని విమర్శించారు. ఫైబర్ నెట్ వ్యవస్థలో అక్రమ నియామకాలు, ఆర్థిక దుర్వినియోగం చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ప్రజలకు మళ్లీ ఫైబర్ నెట్ సేవలను అందించేందుకు పారదర్శకమైన విధానాలు చేపడతామని జీవీ రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమంగా నియమించిన సిబ్బందిని తొలగించడంతో పాటు, కొత్తగా ఖాళీలను నింపే ప్రక్రియ పారదర్శకంగా జరగనుందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లతో సమాలోచనలు చేసి, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో ఉద్దేశించిన విధంగా ఫైబర్ నెట్ ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, కేబుల్ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఈ అవకతవకలపై పూర్తి విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.