న్యాయస్థానాలు.. ప్రత్యక్ష ప్రసారం.! అసలేం జరుగుతుంది.?

ఫలానా కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఫలానా విధంగా వ్యాఖ్యానించారంటూ మీడియాలో కథనాలు రావడం తప్ప, అసలు విచారణ ఎలా జరుగుతుంటుంది.? న్యాయవాదుల వాదనలు ఎలా వుంటాయ్.? న్యాయమూర్తి చేసే వ్యాఖ్యల పరిస్థితేంటి.? అన్నదానిపై సాధారణ ప్రజానీకానికి పెద్దగా అవగాహన లేదు.

గతంలో చట్ట సభల కార్యకలాపాల విషయంలోనూ సామాన్యులకు అవగాహన వుండేది కాదు. ప్రజా ప్రతినిథులు చట్టాలు చేస్తారు, వాటి ప్రకారం నడుచుకోవడమే.. అన్న భావన సామాన్యుల్లో వుండేది. ఇప్పుడు పరిస్థితి అది కాదు. చట్ట సభల కార్యకలాపాల్ని లైవ్‌లో చూడగలుగుతున్నాం. ప్రజలకూ వాస్తవాలు తెలుస్తున్నాయ్. అయితే, అధికారంలో వున్నోళ్ళు తాము ఏం చూపించాలనుకుంటున్నారో అదే ప్రజలకు కనిపిస్తుంటుంది చట్ట సభలకు సంబంధించి.

మరి, న్యాయస్థానాల్లో విచారణల వ్యవహారాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశం సామాన్యులకు దక్కితే ఏమవుతుంది.? సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ వ్యవహారం ప్రారంభమైంది.

సినిమాల్లో చూసినట్లు, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసినట్లు, మీడియాలో కథనాలు వచ్చినట్లుండద విచారణల వ్యవహారం న్యాయస్థానాల్లో. కానీ, ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు చూస్తోంటే, ‘న్యాయస్థానాల్లో ఇలా ఎలా జరుగుతుంది.?’ అని జనం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

లైవ్ ప్రసారాలు షురూ అవుతున్నాయ్ గనుక, ఆయా విచారణలపైనా, న్యాయమూర్తుల వ్యాఖ్యలపైనా, తీర్పులపైనా జనబాహుళ్యంలో చర్చ జరుగుతుంది. మీడియాలో కూడా లైవ్ డిబేట్లు పెట్టేందుకు ఆస్కారమేర్పడుతుంది. మరి, తీర్పులపై విమర్శలు వస్తే.? న్యాయస్థానాలపై అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఎవరైనా చేస్తే.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే సుమీ.!