పాక్ లో నిశబ్ద పుత్ర శోకం… అల్లరి మూకల చేతిలో F16 పైలట్ హతం

పాకిస్తాన్ ఒక విచిత్రమయిన సంక్షోభంలో పడిపోయింది.ఒక ముద్దుబిడ్డ ప్రాణం పోయినా దు:ఖించలేని దీనావస్థ ఆదేశంలో ఉంది. కొడుకు బలయిన శోకాన్ని బయటకు రానీయడం లేదు,ఎవరినీ కలవనీయడం లేదు. ఒక కుటుంబం శోకం మీద, బాధ మీద అక్కడ నిషేధం విధించారు.

నిన్న మధ్నాహ్నం పాకిస్తాన్ చెర నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్థమాన్ చిరునవ్వులు చిందిస్తూ వేలాది మంది కరతాళ ధ్వనుల మధ్య, హర్షధ్వానాల మధ్య వఘా బార్డర్ పోస్టు దగ్గిర నడుకుంటూ కుటుబం సభ్యలను అభిమానులను కలుసుకున్నాడు.

అయితే, అదే సమయంలో సరిహద్దు కావల ఒక  పాకిస్తాన్ కుటుంబం నిశబ్దంగా, ఎవరికీ తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా శోకిస్తూ ఉంది. ఆ కుటుంబం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ షాజాదుద్దీన్.

షాజాదుద్దీన్ కూడా అభినందన్ లాంటి వాయు సైనికుడే. బాలాకోట్ తర్వాత ఆయన్ని ఇండియన్ మిలిటరీ స్థావరాల మీదకు పాకిస్తాన్ పంపించింది. ఆయన F16 యుద్ధ విమానంలో సరిహద్దు దాటి వచ్చారు. నౌషేరా సెక్టర్ ఎగురుతున్నపుడు భారత వాయు సేన ఆ విమానాన్ని కూల్చేసింది. దీనితో షాజాదుద్దీన్ విమానం నుంచి దుమికాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పడ్డాడు. అయితే ఆయనను భారతీయ కెప్టెన్ గా భావించి అక్కడి అల్లరి మూక కొట్టి చంపేసింది.

 

పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో కూడా లేదు. ఆ యువకుడి త్యాగాన్ని గుర్తించలేని దయనీయమయిన రాజకీయం ఆ దేశానిది. షజాద్ కుటుంబం మీద పూర్తినిషేధం విధించారు. పాకిస్తాన్ లో ఆ వార్తలెక్కడా ప్రచురితం కావడం లేదు. చివరకు సోషల్ మీడియా కూడా రాయడం లేదు. షాజాదుద్దీన్ ఎక్కడ అని ప్రశ్నించే నాధుడే లేడక్కడ.

అభినందన్ కు , షాజాదుద్దీన్  కు చాలా పోలికలున్నాయి. ఇద్దరు వాయుసైనికుల కుటంబాలనుంచే వచ్చారు.ఇద్దరు వింగ్ కమాండర్లే. అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ లాగే షాజాదుద్దీన్ తండ్రి వసీమ్ ఉద్దీన్ కూడా ఎయిర్ మార్షల్ గా పనిచేసి రిటైరయ్యారు.ఆయన కూడా F16 విమానాన్ని నడిపారు.

ఇద్దరు ఆయాదేశాల తరఫున ఒకే రోజు యుద్ధభూమిలోకి వచ్చాడు. అభినందన్ కూడా అల్లరి మూకలో చేతిలో పడ్డా సురక్షితంగా బయటకురాగలిగాడు. అయితే, సొంత దేశంలోనే, భారత్ అంటే శత్రుత్వ నూరిపోసిన రాజకీయ విధానాల వల్ల అక్కడి అల్లరి మూకలు సొంత వాయుసైనికుడిని గుర్తించలేనంత అంధవ్యతిరేకత అక్కడుంది. అందుకే షాజాదుద్దీన్ ను భారతీయుడని కొట్టి చంపారని ఫస్ట్ పోస్ట్ రాసింది.

అయితే, దీనిని పాకిస్తాన్ ఖండిస్తూ ఉంది. భారతీయ మీడియా అబద్దాలకోరుగా చిత్రీకరిస్తూ ఉంది.షాజాదుద్దీన్ సజీవంగా ఉన్నాడని చెబుతూ ఉంది. అయితే, ఆయన చిత్రాలను గాని వీడియోను గాని షేర్ చేయడం లేదు.చివరకు ఎక్కడో లండన్ నుంచి ఈ వార్త బయటకు పొక్కింది.

ఫస్ట్ పోస్టు కథనం ప్రకారం, షాజాదుద్దీన్ విమానాన్ని భారతీయ వాయుసేన కూల్చేసిన సమాచారాన్ని లండన్ కు చెందిన ఒక న్యాయవాది ఖలీద్ ఉమర్ బయటపెట్టారు. ఆయనకు ఈ దుర్వార్త షాజాదుద్దీన్ కుటుంబ బంధువులను నుంచి వచ్చింది.

ఉమర్ చెబుతున్న సమాచారం ప్రకారం భారతీయ వాయుసేన కూల్చేయగాని F16 నుంచి దూకి పారాష్యూట్ సహాయంతో కిందకు సురక్షితంగా లామ్ వ్యాలీలో దిగాడు.లామ్ లోయ నౌషేరా నుంచి పడమటకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి విస్తరిస్తుంది. షాజాదుద్దీన్ భూమ్మీదకు దిగగానే ఆయన మీద అక్కడున్న అల్లరి మూకలు దాడి చేశాయి. ఆయన కు తీవ్రంగా గాయలయ్యాయి. తర్వాత ఆసుపత్రికి చేర్చారు. అక్కడ చనిపోయాడు.

వింగ్ కమాండర్ షాజాదుద్దీన్ 19 స్క్వాడ్రాన్ కు పనిచేస్తున్నారు. ఈ స్క్వాడ్రాన్ ను 1965,197 1 యుద్ధాలలో పనిచేసి అమరులయిన వారిపేరు మీద ‘షేర్ దిల్స్’ అని కూడా పిలుస్తారు.

పాకిస్తాన్ లో ఇలా సమాచారాన్ని దాచడం సంప్రదాయ. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇందులో పాక్ సైన్యం పాల్గొంటున్నదని అంగీకరించలేదు. దీనితో ఉత్తర పాకిస్తాన్ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. కార్గిల్ యుద్ధం ముగిసిన 11 సంవత్సరాల మాత్రమే పాకిస్తాన్ తమ సైనికులు చనిపోయినట్లు అంగీకరించింది. 453 మృతుల పేర్లను ప్రకటించింది. అందులో కొందరికి అత్యున్నత మరణానంతర పురస్కారాలను అందించింది.

ఇపుడు కూడా షాజాదుద్దీన్ మృతిని ఎపుడు ప్రకటిస్తుందో తెలియదు. దీనికి మరొక కారణం కూడా ఉంది. F16 విమానాలను అమెరికా నుంచి కొంటున్న పుడు ఆమెరికా ఒక షరతు విధించింది. ఈ విమానాలను తీవ్రవాదుల మీదకే ప్రయోగించాలితప్ప భారత్ మీద ప్రయోగించరాదు. అందుకే తొలినుంచి మేం F16 విమానాలను ప్రయోగించలేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నది. భారత్ సాక్ష్యాన్ని కూడా చూపించింది. ఈ యుద్ధవిమానాన్ని నడుపుతూనే షాజాదుద్దీన్  చనిపోయాడుకాబట్టి, ఆయన మృతిని అంగీకరించేందుకు పాక్ ఇబ్బంది పడుతూ ఉండవచ్చు.

ఇది కూడా చదవండి

పుల్వామా, బాలాకోట్, అభినందన్… బాలివుడ్ లో కొత్త టైటిల్స్ తెగ పోటీ