YS Jagan: జగన్ కేసులు మరో రాష్ట్రానికి బదిలీ అవుతాయా?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ జగన్ అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చర్చకు దారితీసింది. ఈ కేసుల విచారణ ఆలస్యం అవుతుందని, ఇది న్యాయ ప్రక్రియకు లోపమని రఘురామ కోర్టుకు విన్నవించారు. దీనిపై సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మాసనం విచారణ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు.

ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు గతంలో రోజువారీ విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ ఆదేశాలను అమలు చేయడంలో ఎక్కడ సమస్యలున్నాయని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు తమ విధుల్ని సమర్ధవంతంగా నిర్వహించాలనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. రఘురామ పిటిషన్ పట్ల ప్రాసిక్యూషన్ న్యాయవాదులు తమ వాదనలను సమర్పించారు. డిశ్చార్జ్ పిటిషన్‌లు, ఉన్నత న్యాయస్థానాల్లో కేసులపై వాయిదాలు అనేవే ప్రధాన ఆలస్యానికి కారణమని వివరించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటిని పట్టిక రూపంలో సమర్పించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వివరణలు రెండు వారాల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీబీఐ, ఈడీ సంస్థలను కోర్టు ఆదేశించింది. అలాగే, రోజువారీ విచారణకు ఆటంకాలు కలిగించే అంశాలను నివారించాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసిన కోర్టు, అన్ని వివరాలను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.