HMPV Virus: చైనాలో మరో సరికొత్త వైరస్ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్ద ఎత్తున చైనాలో ఈ వ్యాధి కారణంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈ హెచ్ఎంపివీ కేసులు భారత్ లో కూడా నమోదు కావడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
భారత్ లో ఇప్పటికే మూడు కేసులు పాజిటివ్గా వచ్చాయని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైద్య అధికారులు ఈ వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొన్ని కీలక ఆదేశాలను జారీచేశారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అధికారులకు రాష్ట్ర ప్రజలకు కొన్ని దిశా నిర్దేశాలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇప్పటికే గుజరాత్ కర్ణాటకలో హెచ్ఎంపివీ వైరస్ కేసులు నమోదు కావడంతో అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అదేవిధంగా మైక్రో బయాలజిస్ట్లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని నిర్ధేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ వైరస్ కొత్తది కాదని 2001 వ సంవత్సరం నుంచి ఈ వైరస్ ఉందని అయితే ఎవరైతే జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈయన ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలోని ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్స్ సిద్ధం చేయాలి. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. వెంటనే 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించాలి. రాష్ట్రంలో ఔషధాల లభ్యతపైనా సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ప్రజలకు కూడా ఈయన కొన్ని విషయాలను వెల్లడించారు. ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటించాలని మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని 20 సెకండ్ల పాటు తరచూ చేతుల శుభ్రంగా కడుక్కొని జాగ్రత్తలు పాటించాలని చంద్రబాబు తెలిపారు.