YS Jagan: వైఎస్ జగన్ లండన్ పయనం.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలిసి యూకే పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 15 వరకు లండన్ పర్యటన కోసం అనుమతి ఇవ్వాలని కోరిన జగన్, తన కుమార్తెలు అక్కడ చదువు తీసుకుంటున్న కారణంగా వీలుగా లండన్ వెళ్లాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలైన తర్వాత వాదనలు వినిపించనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జగన్ ఈ పర్యటనకు కోర్టు నుంచి అనుమతి పొందే అవకాశాలపై చర్చ నడుస్తోంది. సీబీఐ కౌంటర్ లోని అంశాలపై ఆధారపడే ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్‌పై విడుదలైనప్పటికీ, విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతి పొందడం తప్పనిసరి. గతంలో ఆయన అనేకసార్లు కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లారు. ఈసారి కూడా కుటుంబ కారణాలతో అనుమతి కోరినట్లు తెలుస్తోంది. జగన్ పర్యటనపై కొంత మంది విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతుండగా, ఇలాంటి పర్యటనలు ఎందుకు అవసరమంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీబీఐ వాదనలు, కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ యూకే పర్యటనకు అనుమతి లభిస్తుందో లేదో చూడాలి.