Hansika Motwani: టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది హన్సిక. ప్రస్తుతం ఆమె బుల్లితెరఫై ప్రసారం అవుతున్న ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక బుల్లితెర నటి హన్సిక వేధింపులు తాళలేకపోతున్నాను అంటూ పోలీసులను ఆశ్రయించింది.
అసలేం జరిగింది ఆ నటి ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముస్కాన్, ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది.
తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంత కాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది అని ఆమె తెలిపింది.