Anjali: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో చాలా సినిమాల్లో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. ముఖ్యంగా అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ, లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా హిందీ,తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే అంజలి తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ వైఫ్ క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా అంజలీ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మీరు నటించిన రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతుండడం ఎలా అనిపిస్తోంది? అని అడగగా అంజలి స్పందిస్తూ.. ఏ యాక్టర్‌కు అయినా తమ సినిమా సంక్రాంతికి వస్తుంటే సంతోషంగా ఉంటుంది. నేను నటించిన గేమ్ ఛేంజర్,మదగజరాజ రిలీజ్ అవుతుండడం రెట్టింపు ఆనందం. రెండింటినీ ప్రేక్షకులు ఆదరిస్తాననే నమ్మకం ఉంది అని తెలిపారు. పార్వతి కోసం ఎలా సన్నద్ధమయ్యారు? అని అడగగా? అంజలి స్పందిస్తూ.. దాని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాలేదు. సస్పెన్స్, ట్విస్టులతో కూడిన పాత్రని శంకర్ ఇప్పటికే చెప్పారు. అందుకే ఇప్పుడు నేను దాని గురించి ఎక్కువ రివీల్ చేయలేను.
తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా పార్వతి జ్ఞాపకాలు నన్ను వెంటాడేవి. అంతగా కనెక్ట్ అయిపోయాను అని ఆమె తెలిపింది. రామ్ చరణ్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది? అని అడగగా అంజలి మాట్లాడుతూ.. రామ్ చరణ్ సెట్స్‌కి రాగానే అందరిని పలకరిస్తారు. ఆయనతో కలిసి నటించడం, దిల్ రాజు నిర్మాణంలో, శంకర్ దర్శకత్వంలో నటించడం ఇలా ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. శంకర్ డైరెక్షన్ లో నటించాలన్న డ్రీమ్ ఇప్పటికి నెరవేరింది. ఈ సినిమా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. తదుపరి ఎంపిక చేసుకునే కథలు, పాత్రల విషయమై జాగ్రత్త పడాల్సి వస్తుంది. పేరుకు తగ్గట్టే ఈ మూవీ నాకు గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు అని తెలిపింది అంజలి.