ఎన్నికల ముందర సిట్టింగ్ ప్రజా ప్రతినిథులకు స్థాన చలనం, టిక్కెట్లు దొరక్కపోవడం అన్ని పార్టీల్లోనూ మామూలే. సహజంగానే అధికార పార్టీలో ఈ తరహా పంచాయితీలు ఎక్కువ వుంటాయి. వైసీపీలోనూ అలాగే వున్నాయి. అయితే, ఈ విషయమై జరుగుతున్న రచ్చ మాత్రం ఒకింత ఆశ్చర్యకరంగా వుంటోంది.
టిక్కెట్లు దక్కినోళ్ళు, దక్కనోళ్ళు.. ఇద్దరూ అసహనంగానే కనిపిస్తున్నారు. పైకి నవ్వుతూ కొందరు, పైకి ఏడుస్తూ ఇంకొందరు కనిపిస్తుండడం విశేషం. మంత్రి గుడివాడ అమర్నాథ్, తనకు స్థాన చలనం కలుగుతుండడంపై కంటతడి పెట్టేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనకు స్థాన చలనం కలగడంపై గుస్సా అవుతున్నారుగానీ, పైకి చెప్పడంలేదు.
ఇక, టిక్కెట్టు దక్కకపోవడంతో కొందరు వైసీపీని వీడుతున్నారు కూడా.! అలా వైసీపీని వీడుతున్న నేతలు, టీడీపీ లేదా జనసేన వైపు చూడటంలో వింతేమీ లేదు. చిత్రంగా కాంగ్రెస్, బీజేపీల వైపూ కొందరు వైసీపీ నేతలు చూస్తుండడం కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా వున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ జగన్ మీదనే కేసులు పెడతానంటూ కొత్త పల్లవి అందుకున్నారాయన.
ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. అసలు పండగ ముందర వుంది. టీడీపీ – జనసేన మధ్య పొత్తు పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీట్ల పంపకాలపై ఓ క్లారిటీ వస్తే, అప్పుడే పొత్తుల వ్యవహారం మరింత ముందుకు కదులుతుంది.
ఈలోగా టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు, ఆయా పార్టీల్లో వుండాలా.? వద్దా.? అన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టిక్కెట్ల పంపకాలపై ఇరు పార్టీలూ ఓ నిర్ణయాకి వస్తే, ఇక అంతే సంగతులు.! అందుకే, టిక్కెట్ల పంపకాల విషయమై టీడీపీ, జనసేన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.