రాజకీయాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్న పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని అంటారు. ఈపార్టీలో అవకాశాలు ఏ స్థాయిలో ఉండేవో.. అంతర్గత ప్రజాస్వామ్యం అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని అంటుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 55 మందితో తొలి అభ్యర్థుల జాబితా విడుదలయ్యింది. దీంతో మరోసారి అసంతృప్తుల లిస్ట్ తెరపైకి వచ్చింది. దీంతో… పార్టీ అధిష్టాణం తన ప్రయత్నాలు తాను చేస్తుందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ఉమ్మడి పాలమూరులో టికెట్ దక్కని అసమ్మతిని ఓ కొలిక్కి తెచ్చారని చెబుతున్నారు. బుజ్జగింపుల ఫలితంగా ఒక్కో నేత తిరిగి పార్టీతో మమేకం అవుతున్నారని అంటున్నారు. మిలిగిన నేతలను సైతం దారికి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. వాస్తవానికి ఒకటి రెండు రోజుల్లో రెండో విడత ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబిత కూడా విడుదల అవ్వొచ్చని అంటున్నారు. ఈ లోపు ఫస్ట్ లిస్ట్ లో అసంతృప్తులను బుజ్జగిస్తున్నారని తెలుస్తుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ టికెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ ఆశావహులు తీవ్ర నిరాశకు లోనయ్యారు! కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల్ నియోజకవర్గాల్లో హస్తం పార్టీలో ఒక్కసారిగా అలజడి రేగింది. కొందరు పార్టీ తీరు పట్ల బహిరంగంగా తమ నిరసనను వ్యక్తం చేస్తే.. మరికొందరు మాత్రం నేరుగా హస్తినకు పోయి అధిష్టానం ముందు గోడు వెళ్లబోసుకున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే… నాగర్ కర్నూల్ లో నాగం జనార్ధన్ రెడ్డి, కల్వకుర్తిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, గద్వాల్ లో పటేల్ ప్రభాకర్ రెడ్డి, చింతపల్లి జగదీశ్వర్ రావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో చింతపల్లి జగదీశ్వర్ రావు పార్టీ పోస్టర్లు గట్రా చించేసి నిరసన తెలిపారు. పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేశారు.
మరునాడే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి టికెట్ సైతం పొందాడు జగదీశ్వర రావు. మరోవైపు గద్వాల్ లో టికెట్ దక్కపోవడంతో పటేల్ ప్రభాకర్ రెడ్డి ఏకంగా పార్టీని వీడి అధికార బీఆరెస్స్ పార్టీలో చేరిపోయారు. కల్వకుర్తిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా బరిలో ఉండాలని అనుచరులు, కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహించాడు.
ఇంతలోనే ఏమిజరిగిందో తెలియదు కానీ… పార్టీ వీడిన జగదీశ్వర రావును కాంగ్రెస్ అధిష్టానం నేతలు బుజ్జగించారని అంటున్నారు. ఆయనతో చర్చలు జరిపి భవిష్యత్ పై భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారట. దీంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు… కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అదేవిధంగా… కల్వకుర్తిలో సుంకిరెడ్డి తోను పార్టీ అధిష్టానం నేతల చర్చలు విజయవంతమైనట్లు తెలుస్తోంది. మొదట్లో ఉన్నంత అసంతృప్తి ప్రస్తుతం కనిపించడం లేదని అనుచరులు చెపుతున్నారు. ఇక నాగర్ కర్నూల్ లో నాగం జనార్ధన్ రెడ్డి తో ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ పెద్దలు సంప్రదింపులు జరిపారని.. దీంతో ఆయన కూడా ఆల్ మోస్ట్ సైలెంట్ అయినట్లేనని తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వాల సక్సెస్ రేటు పెరిగిందని చెబుతున్నారు.