నల్లగొండలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు(61) చనిపోయారు. నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు హరికృష్ణ శరీరం సహకరించకపోవడంతో పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణే స్వయంగా కారు నడుపుతున్నారు. ఛాతీకి బలంగా స్టీరింగ్ గుద్దుకోవడం వల్లే ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో ఆయన టొయోటా ఫార్చూనర్ కారు 150 కిమీ వేగంతో దూసుకుపోతూ ఉందని పోలీసులుచెప్పారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఒక మారుతి డిజైర్ ను కూడా ఢీకొందని పోలీసులు చెప్పారు. మరో మూడోరోజుల్లోఅంటే సెప్టెంబర్ 2 ను ఆయన పుట్టిన రోజు వేడుకలు జరగాల్సి ఉంది . ఇలాంటపుడు ఈ ప్రమాదం జరిగింది. ఆయనతో ప్రయాణిస్తున్న మరొక ముగ్గురికి పెద్దగా గాయాలు కాలేదు.
హైదరాబాద్ నుంచి నెల్లూరులో ఒక పెళ్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదం విషయం తెలుసుకున్న హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి బయలు దేరారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్ బయలు దేరినట్టు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి.