Palla Srinivasa Rao: రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో ఎంతో ప్రో-యాక్టివ్‌గా వ్యవహరిస్తోందని, రాష్ట్రం ‘స్వర్ణాంధ్ర’ దిశగా వేగంగా పయనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం విశాఖపట్నంలో పర్యటించిన పల్లా శ్రీనివాసరావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎకనామిక్ రీజన్ డెవలప్‌మెంట్ సమావేశంలో 2032 నాటికి పలు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో దాదాపు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

స్టీల్ ప్లాంట్‌పై కీలక వ్యాఖ్యలు: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలపై పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. కొందరు తమ రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. యాజమాన్యం కార్మికుల పక్షాన బాధ్యతగా నిలబడి, స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

