Minister Subhash – Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నానిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూనే, ఘాటు విమర్శలు గుప్పించారు. గతంలో పులులు, సింహాలు అంటూ గొప్పలు చెప్పుకున్న వారు ఇప్పుడు ‘గ్రామ సింహాలు’గా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.
జగన్ కోసమే బూతులు.. ఇప్పుడు భయం ఎందుకు? మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సంతోషపెట్టడానికే కొడాలి నాని ఇన్నాళ్లు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. “అవాకులు చవాకులు పేలినప్పుడు లేని భయం, ఇప్పుడు రెడ్ బుక్ పేరు ఎత్తితేనే ఎందుకు పుట్టుకొస్తోంది? ఇప్పుడు గజగజలాడుతూ డైపర్లు వేసుకుని తిరగడం ఎందుకు?” అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని ముందుగా యోగా, వాకింగ్ చేసి తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు.
సంతకాల సేకరణ ఓ బోగస్.. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణను మంత్రి సుభాష్ ‘బోగస్’గా అభివర్ణించారు. ఆ పార్టీ కార్యకర్తలు సంతకాలు పెట్టి పెట్టి చేతులు పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. “151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారామో తెలుసుకునేందుకు సంతకాలు సేకరిస్తే మంచిది” అని వైసీపీ నేతలకు సూచించారు.

విశాఖ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు. దీనిని చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. గత వైసీపీ హయాంలో విశాఖను గంజాయి హబ్‌గా, కబ్జాలకు కేంద్రంగా మార్చేశారని మంత్రి ధ్వజమెత్తారు.
చంద్రబాబుని చూసి నేర్చుకోండి.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని సుభాష్ గుర్తు చేశారు. చంద్రబాబును చూసి రాజకీయాలు నేర్చుకుంటే, మరో 25 ఏళ్ల తర్వాతైనా అధికారం కోసం పోటీపడే అవకాశం ఉంటుందని మంత్రి సుభాష్ వైసీపీ నేతలకు సూచించారు.

