Gudivada Amarnath: జగన్ బాటలోనే చంద్రబాబు.. విశాఖ అభివృద్ధిపై గుడివాడ అమర్నాథ్ చురకలు

Gudivada Amarnath: విశాఖపట్నం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలు, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే పోలి ఉన్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖను రాష్ట్రానికి ‘గ్రోత్ ఇంజన్’గా మొదట గుర్తించి, అభివర్ణించింది జగన్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు.

ఘనత మాదే.. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాధాన్యతను గుర్తించని చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖకు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు రావడానికి అప్పటి జగన్ ప్రభుత్వ కృషే కారణమని స్పష్టం చేశారు. పరిశ్రమల రాక అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, అయితే కూటమి ప్రభుత్వం దీనిని తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

భూముల కేటాయింపుపై ధ్వజం ప్రభుత్వ భూముల కేటాయింపు విధానంపై అమర్నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరకే ఎందుకు కట్టబెడుతున్నారు? మీకు నచ్చిన వారికి రూపాయికే భూములు ఇస్తారా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఎకరా భూమిని లూలూ సంస్థ కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే, ఏపీలో మాత్రం అత్యంత చౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ప్రచార ఆర్భాటం ప్రభుత్వ ప్రకటనల్లోనూ ప్రజాధనాన్ని నారా లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికే వాడుతున్నారని అమర్నాథ్ దుయ్యబట్టారు. “ప్రకటనల్లో ప్రధాని మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలు నామమాత్రంగా, చుక్కల్లా మారాయి. కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫొటో కూడా పెట్టడం లేదు” అని విమర్శించారు. గతంలో జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు విమర్శించిన మీడియా, ఇప్పుడు చంద్రబాబును ప్రశంసించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరకామణి పాపం || Journalist Bharadwaj EXPOSED Parakamani CI Satish Kumar Death Mystory || TR