మగాళ్ల శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. సంపద, అదృష్టం ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయంట..!

మన శరీరంపై కనిపించే పుట్టుమచ్చలను చాలామంది సాధారణ విషయంగానే చూస్తారు. కానీ జోతిష్య శాస్త్రం ప్రకారం, ఇవి కేవలం శరీర లక్షణాలు మాత్రమే కాకుండా వ్యక్తి జీవిత గమనాన్ని, అదృష్టాన్ని, స్వభావాన్ని కూడా సూచిస్తాయని చెబుతారు. ముఖ్యంగా పురుషుల శరీరంపై కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే, వారి జీవితంలో సంపద, గౌరవం, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ఉంది.

జోతిష్య నిపుణుల ప్రకారం, పురుషుల నుదుటి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉండి, దానిపై వెంట్రుకలు కూడా కనిపిస్తే అలాంటి వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి ఉండదట. వీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకొని అపారమైన ఐశ్వర్యాన్ని పొందుతారని చెబుతారు. అలాగే ముఖ భాగంలో ఎక్కడైనా పెద్ద పుట్టుమచ్చ ఉండి దానిపై వెంట్రుకలు ఉంటే, అది కూడా శుభ సూచకంగా పరిగణిస్తారు. అలాంటి వారు నాయకత్వ లక్షణాలతో పాటు ఆర్థికంగా బలంగా ఎదుగుతారని నమ్మకం.

నెత్తి మీద లేదా నడినెత్తి భాగంలో పుట్టుమచ్చ ఉన్న పురుషులు స్వతంత్ర స్వభావంతో ఉంటారట. తమ నిర్ణయాలపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగుతారు. కొన్నిసార్లు ఈ లక్షణం గర్వంగా మారినా, వారు ఏ పని చేసినా చివరికి సంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తారట. నుదుటిపై సాధారణంగా పుట్టుమచ్చ ఉన్నవారికి జీవితం స్థిరంగా, ప్రశాంతంగా సాగుతుందని జ్యోతిష్యం చెబుతోంది.

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. బంధువుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉండటం, వారి సుఖసంతోషాల కోసం త్యాగాలు చేయడం వీరి ప్రత్యేకత. అలాగే కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్నవారు కేవలం తమ కుటుంబానికే కాదు, సమాజం మొత్తానికి మేలు చేయాలనే తపనతో ఉంటారని చెబుతారు. అందరి బాధలను తమవిగా భావించే స్వభావం కారణంగా కొన్నిసార్లు తామే కష్టాలను ఆహ్వానించుకుంటారట.

నాలుకపై పుట్టుమచ్చ ఉన్న పురుషుల మాటలో ప్రత్యేక ఆకర్షణ ఉంటుందట. వారు మాట్లాడే తీరు ఎదుటివారిని సులభంగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు, పురుషుల శరీరంలో ఎడమ భాగాన్ని భార్య భాగంగా పరిగణిస్తారు. ఎడమ వైపున పుట్టుమచ్చలు ఉన్నవారి జీవితంలో ఆదర్శవంతమైన, అనుకూలమైన భార్య లభిస్తుందని జ్యోతిష్య విశ్వాసం. అలాగే కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నవారు సంతానంపై అపారమైన ప్రేమతో, పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసే తండ్రులుగా మారుతారట.

ఇక అరుదుగా కనిపించే నీలం రంగు పుట్టుమచ్చల విషయానికి వస్తే, ఇవి జోతిష్య పరంగా మాత్రమే కాదు, వైద్యపరంగానూ జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కడైనా నీలం రంగు పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటే, ఆలోచనా స్థిరత్వం లోపించవచ్చని జోతిష్యం చెబుతుండగా, ఆరోగ్య సమస్యలకు సంకేతమై ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మచ్చలు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.