Railway: రైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. ఇకపై కొత్త ఛార్జీల భారం..!

రైల్లో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై ఎక్స్‌ట్రా లగేజీ తీసుకెళ్తే అదనపు చార్జీలు తప్పవు. లోక్‌సభ వేదికగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించిన తాజా నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రయాణికుల సౌకర్యంతో పాటు రైల్వే వ్యవస్థను మరింత క్రమబద్ధం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం సెకండ్ క్లాస్ ప్రయాణికులు ఉచితంగా 35 కిలోల సామగ్రి తీసుకెళ్లవచ్చు. అదనంగా రుసుం చెల్లిస్తే గరిష్ఠంగా 70 కిలోల వరకు రైలులో వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్లీపర్‌ క్లాస్ ప్రయాణికులకు ఉచితంగా 40 కిలోల లగేజీ అనుమతి ఉండగా, అదనపు చార్జీలు చెల్లిస్తే 80 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.

ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి కూడా స్పష్టమైన పరిమితులు విధించారు. ఏసీ త్రీ టైర్ ప్రయాణికులు ఉచితంగా 40 కిలోలు తీసుకెళ్లవచ్చు. ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్ ప్రయాణికులకు ఉచితంగా 50 కిలోల లగేజీ అనుమతి ఉండగా, అదనపు రుసుం చెల్లిస్తే 100 కిలోల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు మాత్రం ఉచితంగా 70 కిలోలు, డబ్బులు చెల్లిస్తే గరిష్ఠంగా 150 కిలోల సామగ్రి తీసుకెళ్లేందుకు అనుమతించారు.

ఇక రిజర్వేషన్ ప్రక్రియలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రైలు బయల్దేరే సమయానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు బయల్దేరే రైళ్లకు మొదటి చార్ట్‌ను ముందురోజు రాత్రి 8 గంటలకే విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2.01 నుంచి అర్ధరాత్రి 11.59 మధ్య, అలాగే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణించే రైళ్లకు బయల్దేరే సమయానికి 10 గంటల ముందు చార్ట్‌ను విడుదల చేయనున్నారు.

అదే సమయంలో ఐఆర్‌సీటీసీ ఈ-వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ మార్పులతో రైలు ప్రయాణంలో పారదర్శకత పెరగడంతో పాటు, అనవసరమైన రద్దీ, గందరగోళం తగ్గుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎక్స్‌ట్రా లగేజీతో ప్రయాణించే వారు ముందుగానే కొత్త నిబంధనలను తెలుసుకొని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.