Toothpaste: టూత్‌పేస్ట్‌ మింగేస్తున్నారా..? ఫ్లోరైడ్ నిజంగానే శరీరానికి ప్రమాదమేనా..?

సోషల్ మీడియాలో ఒక విషయం పదేపదే చర్చకు వస్తోంది. టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ వల్ల టాక్సిసిటీ, థైరాయిడ్ సమస్యలు, ఎముకల బలహీనత, దంతాల నష్టం జరుగుతాయనే ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది. దీంతో చాలామంది ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌లను పూర్తిగా మానేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది..? నిపుణులు ఏం చెబుతున్నారు ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డెంటల్ నిపుణుల ప్రకారం, టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ పరిమాణం చాలా నియంత్రిత స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు. రోజువారీగా సరైన విధంగా వాడితే ఇది విషపూరితమయ్యే అవకాశం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి, ఫ్లోరైడ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దంత క్షయం (టూత్ డికే) ప్రమాదం సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్రష్ చేసే సమయంలో టూత్‌పేస్ట్‌ను మింగకుండా ఉమ్మివేస్తే, ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఫ్లోరైడ్ వల్ల థైరాయిడ్ లేదా ఎముకల సమస్యలు వస్తాయన్న వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ డెన్సిటీ, శరీరాన్ని ప్రభావితం చేసే స్థాయికి చాలా తక్కువగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలు టూత్‌పేస్ట్‌ను మింగే అవకాశం ఉండటంతో, వారి విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

పిల్లల విషయంలో ఎంత ఫ్లోరైడ్ అవసరం అన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అంతర్జాతీయ పీడియాట్రిక్ డెంటల్ సంస్థల సూచనల ప్రకారం, మూడు సంవత్సరాల లోపు పిల్లలు బియ్యం గింజ పరిమాణంలో 1000 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ వాడాలి. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు బఠానీ గింజంత టూత్‌పేస్ట్ సరిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు పెద్దల మాదిరిగానే 1350 నుంచి 1500 ppm ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. బాల్యంలో ఫ్లోరైడ్ వాడకం దంతాల ఎనామిల్‌ను బలపరచి, భవిష్యత్తులో వచ్చే కేవటీల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది.

ముఖ్యంగా హెర్బల్ లేదా ఫ్లోరైడ్ లేని టూత్‌పేస్ట్‌లు పూర్తిగా సురక్షితమన్న అభిప్రాయం కూడా ఒక అపోహేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి నోటి దుర్వాసనను తగ్గించడంలో, కొంతమేర ప్లేక్ నియంత్రణలో సహాయపడతాయి తప్ప, దంతాలను యాసిడ్ దాడుల నుంచి రక్షించే స్థాయిలో ప్రభావవంతంగా ఉండవు. ఫ్లోరైడ్ అనేది సహజంగా నీరు, నేల, కొన్ని ఆహారాల్లో లభించే మినరల్. ఇది దంతాలపై రక్షణ పొరలా పనిచేసి, మొదటిదశ కవిటీలను కూడా తిరగదోసే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం దంత ఆరోగ్యానికి అత్యంత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఈకథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)