spiritual: తెల్లవారుజామున 2, 3, 4 గంటలకే మెలకువ వస్తుందా.. మీ అంతరాత్మ ఇస్తున్న సంకేతం ఇదే..!

రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో, ఏ అలారం లేకుండానే కొందరు ఒకే సమయానికి మెలకువ రావడం చాలామందికి అనుభవమే. ముఖ్యంగా తెల్లవారుజామున 2, 3 లేదా 4 గంటల సమయంలో కళ్లు తెరుచుకోవడం యాదృచ్ఛికం కాదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. రోజంతా హడావిడిలో, ఒత్తిడిలో మనం వినలేని అంతర స్వరం, ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్న వేళ మన దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేస్తుందని వారు వివరిస్తున్నారు. ఇది నిద్రలేమి సమస్య మాత్రమే కాకుండా, లోపల దాగి ఉన్న ఏదో ఒక ముఖ్యమైన సందేశానికి సంకేతమని భావిస్తున్నారు.

పగటి వేళ మన మనసు పని, బాధ్యతలు, ఆలోచనలతో నిండిపోతుంది. అప్పుడు మనలోని భావోద్వేగాలు, పరిష్కారం కాని సమస్యలు అణచివేయబడతాయి. అదే రాత్రి, చుట్టూ నిశ్శబ్దం అలుముకున్నప్పుడు, అంతరాత్మ మిమ్మల్ని మేల్కొలిపి “నన్ను విను” అని సూచిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. అది మీలో దాగి ఉన్న బాధ కావచ్చు, తీసుకోవాల్సిన కీలక నిర్ణయం కావచ్చు లేదా జీవితంలో మార్పు కోరుకుంటున్న సంకేతం కావచ్చు.

ఆధ్యాత్మికంగా చూస్తే, మీరు మెలకువ వచ్చే సమయానికి కూడా ఒక అర్థం ఉంటుందని చెబుతారు. అర్ధరాత్రి తర్వాత కళ్లు తెరవడం అనేది ఒక దశ ముగిసి, మరో కొత్త దశకు సిద్ధమవుతున్న సూచనగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య సమయాన్ని “ఆధ్యాత్మిక గడియ”గా పిలుస్తారు. ఈ సమయంలో మనస్సు అత్యంత సున్నితంగా ఉండి, అంతర్దృష్టి బలంగా పనిచేస్తుందని నమ్మకం.

ఈ సమయంలో మేల్కొనడం అనేది మీ ఆత్మ ఎదుగుదల దశలో ఉందని, పాత ఆలోచనలను వదిలి ముందుకు సాగమని సూచన కావచ్చు. కొందరి విషయంలో ఇది ప్రార్థన, ధ్యానం లేదా ఆత్మపరిశీలన మొదలుపెట్టాలనే పిలుపుగా కూడా భావిస్తారు. మనకు తెలియకుండానే మనస్సు లోతుల్లో మార్పు మొదలై, అది రాత్రి వేళ మేల్కొలిపే రూపంలో బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇలా మెలకువ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు. వెంటనే ఫోన్ చూడటం లేదా ఆందోళన చెందడం కాకుండా, నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం మంచిదని అంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఆలోచనలు, భావాలను అడ్డుకోకుండా గమనిస్తే, మీకు అవసరమైన సమాధానాలు మీలో నుంచే బయటపడతాయని చెబుతున్నారు. కొందరు చిన్నగా ప్రార్థన చేయడం, లేదా జర్నల్‌లో ఆలోచనలు రాయడం ద్వారా మనస్సును స్థిరపరుచుకుంటారు.

అయితే ప్రతి సారి రాత్రిపూట మేల్కోవడానికి ఆధ్యాత్మిక కారణాలే ఉండాలని లేదు. ఒత్తిడి, కెఫిన్ అధికంగా తీసుకోవడం, షుగర్ లెవెల్స్ మార్పులు, స్లీప్ అప్నియా వంటి శారీరక సమస్యలు కూడా ఇందుకు కారణమవుతాయి. నిద్రలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, ఆందోళన వంటి లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శారీరక ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే, ఇలాంటి అనుభవాలను మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతామని వారు చెబుతున్నారు. రాత్రిపూట లభించే ఈ నిశ్శబ్ద సమయాన్ని ఒక వరంగా భావించి, మన లోపలి ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశంగా ఉపయోగించుకుంటే, అది జీవితంలో స్పష్టత, ప్రశాంతత తీసుకువస్తుందని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.