Raghurama Krisham Raju, : వైసీపీ నుంచి 2019లో ఎంపీగా గెలిచిన కొంత కాలానికే స్వపక్షంలో విపక్షంగా మారి.. అనంతరం పూర్తి ప్రతిపక్ష నాయకుడిగా మారిన రఘురామకృష్ణం రాజు.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేశారు.
ప్రస్తుతం వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అలాంటప్పుడు ఊరికే ఉండని రఘురామరాజు.. సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఆయన చెబుతున్నట్లు తనను కొట్టిన దెబ్బలు గుర్తుకు వచ్చాయో ఏమో తెలియదు కానీ.. సునీల్ కుమార్ ను ఆన్ లైన్ వేదికగా గిల్లుతూనే ఉన్నారు. ఈ సమయంలో సునీల్ కుమార్ ఇస్తున్న రిప్లైలు రఘురామకు కస్టోడియల్ టార్చర్ ను మించిన బాధ కలిగిస్తున్నట్లున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి…
మాట్లాడే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవనే సామెత రఘురామకు సరిగ్గా సరిపోతుందా?
గౌరవనీయమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామ.. సోషల్ మీడియా వేదికగా ఓ ఐపీఎస్ అధికారిపై కామెంట్లు అవసరమా?
వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు రఘురామ ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఎవరికి, ఏమి ప్రయోజనం?
పైగా సునీల్ కుమార్ ను ఏదో అనేశామనే ఆనందంగా పోస్ట్ పెట్టి కూర్చునే లోపు.. అత్యంత బలంగా అటువైపు నుంచి దిమ్మతిరిగిపోయే రిప్లై వస్తుండటం వల్ల తగ్గాల్సిన సమయం వచ్చిందని గుర్తించడం లేదా?
తాజా పరిణామాల నేపథ్యంలో ఇకపై అయినా ఈ పోస్టులు ఆపుతారా.. లేక, కౌంటర్లు వేయించుకుంటూనే ఉంటారా?

వైసీపీ హయాంలో సునీల్ కుమార్ ఏపీ సీఐడీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నోరు పారేసుకుంటున్నారన్న కారణంతో అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆ తర్వాత గుంటూరుకు తీసుకెళ్లారు. అయితే.. ఆ రాత్రి తనను చితక్కొట్టారని.. కాళ్లు వాచిపోయాయని.. గుండెలపై ఎక్కితొక్కారన్నట్లుగా రఘురామ అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవానికి ఆరోజు రాత్రి ఏమి జరిగిందనేది రఘురామకు, సునీల్ కుమార్ కు తప్ప బయటవారికి ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఏది ఏమైనా.. కూటమి ప్రభుత్వం రాగానే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇటీవలే సునీల్ విచారణకు హాజరయ్యారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది. అంతవరకూ బాగానే ఉందనుకునేలోపు.. రఘురామ.. సునీల్ పై పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. వీటికి సునీల్ కౌంటర్లు భారీగానే ఇస్తున్నారు.
ఉదాహరణకు… బ్యాంకు లావాదేవీలకు సంబంధించి రఘురామపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ను క్వాష్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో.. ఆయనపై స్టే ని ఎత్తివేస్తూ, సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై స్పందించిన సునీల్.. ‘దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు.. మంచిదే.. మరి సమ న్యాయం కోసం రఘురామ కృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేయాలి కదా. సీబీఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుంచి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ పంపాలి” అని అన్నారు.

ఈ విషయంలో సునీల్ కుమార్ చెప్పింది న్యాయమేగా అనే చర్చ మొదలైంది. ఆయనకు బాసటగా నెటిజన్లు నిలిచారు. ఇదే సమయంలో ఎవరో చెప్పారని కాదు కానీ.. రఘురామ కూడా ఈ విషయంలో ఆలోచించి, ఆయనే తప్పుకుంటే సమాజానికి అద్భుతమైన సందేశం పంపినవారవుతారు.. సునీల్ విషయంలో కూటమి సర్కార్ తీసుకున్న చర్యకు హేతుబద్ధత లభిస్తుందనే చర్చ జరిగింది.
ఆ సంగతి అలా ఉంటే… ఈ గ్యాప్ లో రఘురామ మరో పోస్ట్ పెట్టారు. “ఈ సమాధి గతం మర్చిపోయిన పీవీ సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువలలో కట్టినది. ఆమె వీడీవోగా పని చేసారు. పాతాళ గ్రేస్ దయాలు వారి పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికెట్ (ఫేక్)తో ఐపీఎస్ సాధించారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్లకై ఏఐఎమ్ పెట్టారామె. ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వయిరీ చెయ్యాలి. ఇప్పుడు గజినిగా మారిన సునీల్ కుమార్ గారికి తల్లి గారి, వారి మతం గుర్తు ఉందో? లేదో?” అని రాస్తూ.. సమాధి ఫొటోలు కూడా జత చేశారు.
ఈ పోస్టుపై సునీల్ కుమార్ ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా తగులుకున్నారు. రఘురామను, ఆయన కుటుంబ సభ్యులతో కలిపి మరీ ఘాటుగా విమర్శించారు. మీది 420 ఫ్యామిలీ అనే స్థాయిలో కామెంట్లు చేశారు. ఆయన కౌంటర్ పోస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దామ్..!

“రఘురామ కృష్ణరాజు గారూ.. మా నాన్న గారి పేరు గంగరాజు గారు. ఇది హిందూ పేరు. మీకు తెలియక పోవచ్చు. మా తాత గారి పేరు పాతాళ పెంటయ్య గారు. ఆయన కొవ్వూరు లో పెద్ద మాల. ఇది కూడా తెలియక పోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లి గారి పేరు ఎత్తే అర్హత మీకు లేదు. మీ కుటుంబంలో మీరు 420, మీ కొడుకు భరత్ ఒక 420, మీ కూతురు ఇందిర ఒక 420. మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం”
“మోసం చేస్తేగాని పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్లుగా కనిపించడంలో వింత ఏముంది. ఈ కనుమూరి రమాదేవి ఎవరో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలుసా ఆర్.ఆర్.ఆర్. గారు? బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవన ఆధారం. మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను.. ఇక్కడ మీ సన్నాసి పోస్ట్ లకు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ఇంకో విషయం.. ఇది మా తల్లి గారి పాత సమాధి. కొత్త సమాధి ఫొటోలు మీకు వచ్చినట్లు లేవు. అవి పంపిస్తా” అని పోస్ట్ పెట్టారు.
దీంతో… ఈ ఫైట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ వ్యాఖ్యలు.. రఘురామకు కస్టోడియల్ టార్చర్ ను మించిన బాధను కలిగిస్తున్నట్లున్నాయనే చర్చా నెట్టింట మొదలైంది. చర్యకు ప్రతిచర్య అంటే ఇదేనేమో!!

