NDA Alliance: కూటమి ప్రభుత్వానికి ‘జిందా తిలిస్మాత్’ ఛాన్స్ ఇక లేనట్లేనా?

NDA Alliance: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో మూడు పార్టీలు ఏకం కావడం, జగన్ పై తప్పుడు ప్రచారం చేయడం, ఈవీఎం ల వ్యవహారం వంటి వాటి సంగతి కాసేపు పక్కనపెడితే.. చంద్రబాబును మరోసారి బలంగా నమ్మారని చెప్పేవారూ లేకపోలేదు. అది అమరావతి విషయంలోనే కానీ, ఇచ్చిన హామీల విషయంలో అయితేనే కానీ..! అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను చంద్రబాబు ఏమేరకు నిలుపుకున్నారన్నది తెలిసిన విషయమే!

ఈ సందర్భంగా తెరపైకి వస్తోన్న పలు ప్రశ్నలు….

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు.. అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ పోటీ పడి ఇచ్చిన హామీలు ఇప్పుడేమయ్యాయి?

బంతి బౌండరీ ఇవతల పడినా కూడా సిక్స్ కొట్టేశామని, సూపర్ సిక్స్ హిట్టని చెప్పుకోవడం లేదా?

ఇక పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను తెరమరుగు చేయలేదా?

ఏపీలో అత్యంత కీలకమైన విద్య, వైద్యం వంటి విషయాలను సైతం ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడటం లేదా?

ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో కీలక హామీలను తుంగలోకి తొక్కలేదా?

ఈ ప్రశ్నలన్నింటికీ కూటమి ప్రభుత్వం నుంచి వస్తోన్న సమాధానాల్లో అత్యంత రెగ్యులర్ గా వినిపించేది ఒకే ఒక్కటి.. అదే.. రుషికోండ భవనాలు!

YS Jagan

ఏపీలో చంద్రబాబుని ఏ సమస్య గురించి అడిగినా ముందుగా చెప్పే సమాధానం… జగన్ రుషికొండలో బిల్డింగ్స్ కట్టి ప్రజాధనాన్ని వృథా చేశారని. అందువల్లే ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోతున్నామన్నట్లుగా చెప్పిన పరిస్థితి. ఈ 18 నెలల్లో సుమారు లక్షన్నర కోట్లు అప్పు చేయడానికి కారణం కూడా నాడు జగన్ రుషికొండ లాంటి ప్రాజెక్టులతో ప్రజాధనాన్ని వృథా చేయడమే అని.

ఇక ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు సైతం చంద్రబాబు ఇచ్చిన సమాధానం కూడా రుషికొండ చుట్టునే తిరిగింది. ఇందులో భాగంగా.. రుషికొండకు పెట్టిన ఖర్చుతో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చని.. ఇప్పుడు అది వైట్ ఎలిఫెంట్ లాగా తయారైందని.. ఆ వృథా ఖర్చుల వల్ల ఈ రోజు పీపీపీకి వెళ్లాల్సి వస్తుందని!

ఈ రేంజ్ లో చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రతీ సమస్యకూ, ప్రతీ ప్రశ్నకూ సమాధానంగా.. రుషికొండ భవనాలను ‘జిందా తిలిస్మాత్’ రేంజ్ లో ఉపయోగించేసిన పరిస్థితి. అయితే తాజాగా మీడియా అడిగిన ఇదే ప్రశ్నకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో స్పందిస్తూ ఇచ్చిన సమాధానంతో ఇక కూటమి ప్రభుత్వానికి ‘జిందా తిలిస్మాత్’ ఎక్స్ పైర్ అయిపోయినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగిందంటే… ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయ‌డాన్ని నిర‌సిస్తూ కోటి సంతకాల ప‌త్రాల‌ను గ‌వ‌ర్నర్‌ కు అందించిన అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతున సమయంలో ఓ విలేఖ‌రి అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇస్తూ.. తాము 230–240 కోట్లతో విశాఖ‌కు త‌ల‌మానికమైన బిల్డింగ్‌ ల‌ను క‌ట్టామ‌ని.. గ‌వ‌ర్నర్, ప్రధాని, ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ వ‌చ్చినా రుషికొండ బిల్డింగ్‌ లో ఉండ‌వ‌చ్చని అన్నారు.

అదే చంద్రబాబు.. కేవ‌లం ఒక రోజు యోగా కోసం రూ.330 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, ఆ యోగా ప్యాడ్‌ ల ఖ‌ర్చు ఎంత అనేది ఒక‌సారి ఏఐతో చూసినా, అమెజాన్ లో వెతికినా అందులో వారు ఖ‌ర్చు పెట్టిన దానిలో స‌గం కూడా ఉండ‌ద‌ని, అంత అవినీతి చేశార‌ని విమ‌ర్శించారు. త‌క్కువ డ‌బ్బుల‌తో అంత పెద్ద బిల్డింగ్ క‌ట్టినా, దానిని రాజ‌కీయం చేసి అది ఏదో స్వంత ఇంటి కోసం క‌ట్టించుకున్నార‌నే విధంగా ప్రచారం చేశార‌ని అన్నారు!

దీంతో… యోగాంధ్ర కోసం కూటమి ప్రభుత్వం చేసిన ఖర్చు.. ఆ రోజు విశాఖలో యోగా మ్యాట్ ల కోసం జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ఒక్కసారిగా చర్చకు వచ్చాయి. దీంతో… జగన్ సమాధానంలో స్పష్టత ఉంది కదా అనే చర్చతో పాటు.. కూటమి ప్రభుత్వానికి ఇకపై జిందా తిలిస్మాత్ లాంటి రుషికొండ విమర్శలకు ఛాన్స్ లేనట్లే అని అంటున్నారు ఏపీ ప్రజానికం!

Makireddy Purushotham Reddy Reacts On Ys Jagan Meets Bhavanipuram Demolition Victims || TR