హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయడంలో కీలక భూమిక పోషించినట్లు చెప్పుకునే చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఇందులో భాగంగా… పలు సమస్యల విషయంలో అమెరికా కంటే ఆంధ్రప్రదేశ్ చాలా మెరుగ్గా ఉంది. ఈ లెక్కలు మరెవరో చెప్పలేదు సుమా.. కలెక్టర్ల సదస్సులో స్వయంగా చంద్రబాబు చెప్పిన అంకెలను అమెరికాలోని పలు నివేధికలతో పోల్చి చూస్తే తెలిసింది.
ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి…
ఆంధ్రప్రదేశ్ నిజంగా కొన్ని విషయాల్లో అమెరికాను మించిపోయిందా?
అదే నిజమైతే ఈ విషయాన్ని ఓ వర్గం మీడియా ఎందుకు మరిచిపోయింది? మొదటికే మోసం వస్తుందని భావించిందా?
అసలు చంద్రబాబు చెప్పిన ఆ సర్వే అంకెల్లో ఎంచుకున్న అంశాలేమిటి? ఏపీలో అన్ని తక్కువ సమస్యలు ఉన్నాయా?
డైరెక్ట్ గా పాయింట్లోకి వెళ్లిపోతే.. అగ్రరాజ్యం అమెరికా కంటే పలు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. అలా అని ఇది అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన విశ్వసనీయ నివేదిక అనుకుంటే పొరపాటే సుమా..! ఇవి చంద్రబాబు చెప్పిన ఒక సర్వే ఫలితాలు. అది ఆయన చేయించారా.. లోకేష్ చేయించారా.. లేక, ప్రభుత్వమే చేయించిందా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్!
తాజాగా కలెక్టర్ల సదస్సులో ప్రసగించిన చంద్రబాబు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు! సూపర్ సిక్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పింఛను పంపిణీపై ప్రజల్లో సంతృప్తస్థాయి 92 శాతం ఉందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసమస్యలపై పలు సర్వేల ఫలితాలను విశ్లేషించినట్లు చంద్రబాబు తెలిపారు. వాటి అంకెలను వివరించారు.
ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు బాగాలేవని 17 శాతం, మురుగుకాలువలపై 5.3 శాతం, నీటి కొరతపై 4.3 శాతం, గృహ వసతిపై 3.8 శాతం, నిరుద్యోగంపై 3.3 శాతం, పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేదని 2.4 శాతం, పింఛన్లపై 2 శాతం, పథకాల అమలుపై 1.1 శాతం, భూసమస్యలపై 1.3 శాతం, కరెంటు కోతలపై 0.4 శాతం, ఎడ్యుకేషన్ సపోర్టు లేకపోవడంపై 0.4 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇక 51 శాతం మంది ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన చాలా విషయాల్లో ఒక చిన్న విషయం ఏమిటంటే… పింఛన్ పంపిణీపై ప్రజల్లో సంతృప్తిస్థాయి 92శాతం ఉందని చెప్పిన చంద్రబాబు.. పింఛను పై సమస్యలు మాత్రం 2శాతం మాత్రమే వచ్చాయని అన్నారు. 92% మాత్రమే సంతృప్తిగా ఉంటే.. మిగిలిన 8% అసంతృప్తిగా ఉన్నట్లే కదా. కేవలం 2 శాతం సమస్య మాత్రమే ఉండటం ఏమిటి అనేది చాలా మంది సామాన్యులకు వచ్చిన ప్రశ్న! ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే!
ఇక పలు నివేదికల ప్రకారం అమెరికా సమ్యుక్త రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఓ కేస్ స్టడీలో సుమారు 75% మంది నీరు నిలిచిపోవడం ఒక సమస్య అని సూచించారు. 49% మంది డ్రైనేజీ నాణ్యతను రేట్ చేయగా.. 28% మంది పేలవంగా ఉందని పేర్కొన్నారు. అయితే… వర్షాలు వస్తే నేరుగా రాజధాని ప్రాంతంలోకే వరదలు వచ్చే ఏపీలో.. డ్రైనేజీ సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయని చెబుతున్న ఏపీలో మాత్రం మురుగుకాలువలపై కేవలం 5.3శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తుంటే… కచ్చితంగా ఈ విషయంలో అమెరికాను ఆంధ్రప్రదేశ్ తలదన్నినట్లే అని భావించవచ్చు!
టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం మరో ఉదహారణను తీసుకుందామ్..! ఇందులో భాగంగా… అమెరికాలో అధికారిక యూఎస్ జాతీయుడి నిరుద్యోగ రేటు నవంబర్ 2025లో 4.6శాతంగా ఉంది.. ఇది గత నాలుగేళ్లలో అత్యధిక స్థాయి అని చెబుతున్నారు. ఈ డేటాను బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తన నివేదికలో ప్రచురించింది! అయితే ఏపీలో మాత్రం నిరుద్యోగంపై 3.3శాతం మంది మాత్రమే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ లెక్కన చూసుకుంటే అమెరికాలో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువత కంటే ఏపీలో ఆ సమస్యను ఎదుర్కొంటున్న యువత తక్కువే అన్నమాట! సో… నిరుద్యోగభృతి ఇవ్వకపోయినా పెద్దగా ఎఫెక్ట్ కనిపించదన్నమాట!

