Palm Oil: సామాన్యులకు సంక్రాంతి ముందు శుభవార్త.. వంటనూనె ధరలు భారీగా తగ్గే అవకాశం..!

ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను వినియోగించే దేశంగా.. పేరున్న భారత్ మరోసారి గ్లోబల్ ఆయిల్ మార్కెట్ దిశను మార్చేసింది. దేశీయ అవసరాలు భారీగా ఉండటంతో విదేశాలపై ఆధారపడే భారత్, తాజాగా పామాయిల్ దిగుమతులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గడంతో, 2025 నవంబర్ నెలలో భారత రిఫైనర్లు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ధరలు అనుకూలంగా మారడంతో పామాయిల్ కొనుగోళ్లు పెరగగా, అదే సమయంలో సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి ఖరీదైన నూనెల దిగుమతులు తగ్గాయి. ఫలితంగా వంటనూనెల దిగుమతుల సరళి ఒక్కసారిగా మారిపోయింది. భారత డిమాండ్ పెరగడంతో ఇండోనేషియా, మలేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తి దేశాల్లో నిల్వలు తగ్గుతున్నాయి. ఇది అక్కడి ఫ్యూచర్స్ ధరలకు మద్దతు ఇస్తుండగా, అమెరికా సోయా ఆయిల్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) గణాంకాల ప్రకారం, నవంబర్‌లో పామాయిల్ దిగుమతులు అక్టోబర్‌తో పోలిస్తే 5 శాతం పెరిగి సుమారు 6.32 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయి. అదే సమయంలో సోయా ఆయిల్ దిగుమతులు 18 శాతానికి పైగా పడిపోయి 3.70 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు అయితే ఏకంగా 45 శాతం తగ్గి, రెండేళ్లలో కనిష్ట స్థాయికి చేరడం గమనార్హం.

ఈ మార్పుల ప్రభావంతో నవంబర్ నెలలో భారత్ మొత్తం వంటనూనెల దిగుమతులు గత నెలతో పోలిస్తే 13.3 శాతం తగ్గి, ఏడు నెలల కనిష్టమైన 1.15 మిలియన్ టన్నుల వద్ద నిలిచాయి. ఇదిలా ఉండగా, చైనాలో సరఫరా ఎక్కువగా ఉండటంతో అక్కడి క్రషర్లు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించారు. దీనిని ఉపయోగించుకున్న భారత్, దక్షిణ అమెరికా దేశాలకంటే చైనా నుంచే రికార్డు స్థాయిలో సోయా ఆయిల్ దిగుమతి చేసుకుంది.

సాధారణంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌ను, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా మరియు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను భారత్ కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్ ధర, సోయా ఆయిల్ కంటే టన్నుకు సుమారు 100 డాలర్లు, సన్‌ఫ్లవర్ ఆయిల్ కంటే దాదాపు 200 డాలర్లు తక్కువగా ఉంది. ఈ ధర వ్యత్యాసమే భారత కొనుగోలుదారులను పామాయిల్ వైపు ఆకర్షిస్తోంది. డిసెంబర్, జనవరి నెలల షిప్‌మెంట్స్ కోసం కొందరు కొనుగోలుదారులు సోయా ఆయిల్ ఒప్పందాలను రద్దు చేసి, పామాయిల్‌కు మారుతున్నారని గ్లోబల్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ధరలు తగ్గడానికి కారణం స్పష్టమే. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఇండోనేషియా, మలేషియా దేశాల్లో సాగు విస్తీర్ణం పెరగడం, అనుకూల వాతావరణం వల్ల దిగుబడి మెరుగుపడటం ప్రధాన కారణాలుగా మారాయి. సరఫరా పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ తీవ్రమై, ధరలు దిగివచ్చాయి. నిల్వలు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉత్పత్తి దేశాలు ఎగుమతులను ప్రోత్సహించడంతో, ఈ ప్రభావం భారత్ వంటి దిగుమతి దేశాలకు లాభంగా మారుతోంది. ఈ పరిస్థితులు కొనసాగితే, రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌లో కూడా వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.