ముస్లింలకు టోపీ పెడితే అసలుకే ఎసరు వస్తుంది

1970 నుంచి 1980 ప్రారంభంకు వరకు దేశ రాజకీయాల్లో ముస్లింలకు మంచి ప్రాధాన్యం లభించింది. సెక్యులరిజానికి వక్రవాష్యం చెప్పిన పార్టీలు అప్పట్లో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకు వారికి తగిన స్థానాలు కల్పించేవి. అప్పట్లో దాదాపు ప్రతీ రాజకీయ పార్టీ ముస్లింలకు దగ్గర చేకుకునేందుకు వారిని తలకెక్కించుకునేవి. అడిగినన్ని టిక్కెట్లు ఇచ్చి మచ్ఛిక చేసుకునేవి. బీజేపీ దేశ రాజకీయాల్లో బలపడుతున్నప్పటి నుంచి ఈపరిణామాలు మెళ్లమెళ్లిగా మారడం మొదలయ్యాయి.

మోడీ శకం వచ్చే సరికి మొత్తం సీన్ మారిపోయింది. దీంతో ముస్లింలను మునుపటిలా దువ్వేందుకు రాజకీయ పార్టీలు జంకే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాల కారణంగా 1990 నుంచి ముస్లింలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చంది. ముఖ్యంగా బీజేపీ బలపడ్డ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సామాజిక వర్గం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య భారీగా తగ్గు ముఖం పట్టింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బాగా బలపడడంతో 2014లో పార్లమెంటులో యూపీ నుంచి ముస్లిం సభ్యుల ప్రాతినిథ్యం సున్నాకు పడిపోంది.

యూపీ జనాభాలో సుమారు 20% మంది ముస్లింలు ఉన్నా. కిందటి సారి లోకసభకు ఆ రాష్ట్రం నుంచి అన్నీ పార్టీలను కలుపుకొని ఎన్నికైంది కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే. 2019 లో మహారాష్ట్ర నుంచి ఒకరు ఎన్నిక కాగా… మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లోకసభలో అడుగు పెట్టలేదు.

545 సీట్లున్న లోక్ సభలో ముస్లిం ప్రతినిధుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 1980 ఎన్నికలలో లోక్ సభ మొత్తం స్థానాల్లో 10% మంది ముస్లింలు ఉంటే… 2014 లో అది 4% కన్నా తక్కువగా నమోదైంది. 2019లో అది 5%కి చేరుకుంది. జనాభా రీత్యా ముస్లింలు లోక్ సభలో 65 స్థానాలు కలిగి ఉండాలి. 1999 నుండి 2017 వరకు పార్లమెంటులో అడిగిన 276,000 ప్రశ్నలను విశ్లేషించగా… ముస్లింల సమస్యల గురించి ముస్లిం సభ్యుల కన్నా ఇతర వర్గాలకు చెందిన సభ్యులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు రికార్డుల్లో ఉంది. ఇక లోక్ సభ సభ్యులలో 1% కంటే తక్కువ మంది ముస్లిం మహిళలు ఉండడం మరీ దారుణం.

జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ లోని ముస్లిం నేతలను తప్పిస్తే సుమారు 30 కోట్ల మందికి దేశరాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మైనారిటీ నేతల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒవైసి(హైదరాబాద్) బద్రుద్దీన్ అజమల్ (ధుబ్రి –అస్సాం) ఫరూక్ అబ్దుల్లా (శ్రీనగర్-JK) ఆజం ఖాన్ (రాంపూర్), ఇంతియాజ్ జలీల్, షఫీకుర్ రహ్మాన్, ST హసన్ లాంటి అతి కొద్ది మంది నేతలు మాత్రమే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగారు.

జాతీయభావజాలం ఉన్న మైనారిటీ నేతలకు తగిన స్థాయిలో ఆయా పార్టీలు ఆదరించకపోతే రానున్న రోజుల్లో విపరీత పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో బీజేపీ బలవడుతున్న కొద్ది మిగతా పార్టీలు కూడా ప్రొహిందూ లైన్ ను తీసుకున్నాయి. అప్పటి నుంచి మైనారిటీల వంతు పాడిన ఇతర పార్టీలు ఇప్పుడు పంథా మార్చాయి. హిందువులు రాజకీయంగా సంఘటితం కావడంతో హిందూ సెంటిమెంట్ లను గౌరవిస్తూ మైనారిటీలకు టిక్కెట్ల కేటాయింపులో కోత పెట్టాయి. అయితే ఈ పరిణామాలు దేశ భవిష్యత్తుకు మంచివి కావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముస్లింలకు ఆయా పార్టీల్లో తగిన ప్రాతినిధ్యం లభించకపోతే మజ్లిస్ లాంటి విచ్ఛన్నరకర భావజాలం ఉన్న ముస్లిం పార్టీలు పుట్టుకొచ్చి మైనారిటీలను ప్రధాన స్రవంతి నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెక్యులరిజానికి సరైన అర్థం ఇవ్వడంతో పాటు పాటించడంలో ఇప్పటికీ రాజకీయ పార్టీలు మన దగ్గర విఫలమవుతున్నాయని తప్పుపడుతున్నారు.