కేసీఆర్ ప్రకటించని సీట్ల వెనుక మతలబిదే… రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తోన్నవేళ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత అందరికన్నా ముందుగానే ఏకంగా 115 నియోజకవర్గాలకు బీఆరెస్స్ అభ్యర్థులను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో భాగ్యనగరంలోని కీలకమైన గోషామహల్ నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు.

అవును… ఒకేసారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆరెస్స్ అధినేత కేసీఆర్… కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రం అభ్యర్థులను పెండింగులో పెట్టారు. వాటిలో గోషామహల్ ఒకటి కావడం గమనార్హం. దీంతో తాజాగా ఈ విషయంపై బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో తేల్చి చెప్పారు.

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో అధిష్టాణం కంటే ముందు ఆయనే చెప్పేశారు! “వచ్చే ఎన్నికల్లో గోషామహల్ బీజేపీ అభ్యర్థిని నేనే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తనకు బీజేపీ పెద్దల వద్ద ఉన్న మద్దతును చెప్పే ప్రయత్నం చేశారు.

బీజేపీ హైకమాండ్ తో పాటు తనకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మద్దతుందని చెప్పుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్… వచ్చే ఎన్నికల్లో కూడా గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని, గెలిచేది కూడా తానే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా… బీఆరెస్స్ తో మరో యుద్ధానికి సిద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు!

ఈ సందర్భంగా కేసీఆర్.. గోషామహల్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి గల కారణాన్ని సైతం రాజాసింగ్ చెప్పారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… గోషామహల్ లో బీఆరెస్స్ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేస్తోందని సంచలన ఆరోపణ చేశారు. 2108లో బీఆరెస్స్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ ను ఎంఐఎం పెట్టిందని చెప్పుకొచ్చారు!

ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో గోషామహల్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించిన రాజాసింగ్… ఆ అభ్యర్థిని ప్రకటించేది కేసీఆర్ కాదు, ఎంఐఎం పార్టీయే అని అన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో గోషామహల్ లో తానే పోటీచేస్తానని.. గెలిచేది కూడా తానే అని.. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబుతున్నట్లు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు!