హైదరాబాద్ లో దుమారం: పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్!!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆరెస్స్ పై విపక్షాలు బీజేపీ – కాంగ్రెస్ లు విరుచుకుపడుతున్నాయి. కేసీఆర్ పేరెత్తితే అటు రేవంత్ రెడ్డి, ఇటు బండి సంజయ్ లు అంతెత్తున లేచి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెన్ని చెప్పినా బీఆరెస్స్ కు ఇప్పటికీ ఎంఐఎం మద్దతు ఉందని బలంగా నమ్ముతున్న బీజేపీ నేతలు ఎంఐఎంపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో బీజేపీ వర్సెస్ ఎంఐఎం వ్యవహారం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చుతుంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్స్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని అమిత్ షా అంటున్నారని.. అదే నిజమైతే పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదని అసదుద్దీన్ ఎదురు ప్రశ్నించారు. ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్స్ లు మోసం చేశాయని అన్నారు.

అనంతరం బీజేపీ నేతలు మాట్లాడితే.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బెదిరిస్తున్నారంటూ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే భారత భూభాగంలోకి వస్తున్న చైనా పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సూచించారు. బీజేపీకి ప్రజలపై ప్రేమ ఉండదు కానీ… ఎంఐఎం పైనా, ముస్లిం సమాజంపైనా అక్కసు మాత్రం పీకల వరకూ ఉంటుందన్నట్లుగా అసదుద్ధీన్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆయన చేసిన పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ అనేది ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా… ముస్లింల జీవితాల్ని ఎంఐఎం నాశనం చేస్తోందని.. బీఆరెస్స్ ను మరోసారి అధికారంలోకి తేవాలని ఎంఐఎం చూస్తోందని.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం ఎంఐఎంకు అలవాటేనని బండి సంజయ్ మండిపడిన సంగతి తెలిసిందే!