స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే బాబు అరెస్టైన కొత్తలో ఈ విషయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలెవరూ స్పందించలేదు! ఈ సమయంలో మీడియా మరీ బలవంతంపెడితే స్పందించాలి కాబట్టి స్పందించినట్లుగా ఒకరిద్దరు రియాక్ట్ అయ్యారు. అయితే… ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యమంలో… అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆరెస్స్ నుంచి బాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య పెరుగుతుందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
అవును… స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నేటితో చంద్రబాబు జైలు జీవితం 50వ రోజులోకి ఎంటరైంది. ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు అరెస్ట్ పై ఇటీవల బీఆరెస్స్ నాయకులు వరుసగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తప్పుచేసినప్పుడు శిక్షించడం కంటే క్షమించడం గొప్ప విషయం అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్పందిస్తే… లోకేష్ బాద తాను అర్ధం చేసుకోగలని కేటీఅర్ రియాక్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా కవిత ఈ విషయంపై స్పందించారు. ట్విట్టర్ లో “ఆస్క్ కవిత” కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానాలు ఇచ్చారు. ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, పొత్తులతో పాటు చంద్రబాబు అరెస్ట్ పై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత జవాబులిచ్చారు. “ఈ వయసులో చంద్రబాబుకు జరుగుతున్నది దురదృష్టకరం. ఆయన కుటుంబం బాధను నేను అర్థం చేసుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి” అని కవిత రిప్లయ్ ఇచ్చారు.
ఇదే సమయలో ఈ ఎన్నికల్లో బీఆరెస్స్ పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు కవిత స్పందించారు. ఇందులో భాగంగా.. తమకు ఏ పార్టీతోనూ జట్టు లేదని.. తెలంగాణ ప్రజలే తమ జట్టు అని కవిత చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో… ఈ ఎన్నికల్లో బీఆరెస్స్ సెంచరీ కొట్టడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని కవిత జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆస్క్ కవిత పోస్ట్ కింద నెటిజన్లు పెట్టిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి!