ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నమోదైన ఏసీబీ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌ను ఏ1గా చూపిస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ తొలుత సింగిల్ బెంచ్‌కు వెళ్లగా, ఈ కేసు ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సంబంధించినదైందని స్టాండింగ్ కౌన్సిల్ వాదించారు.
జస్టిస్ శ్రావణ్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. తదనంతరం కేటీఆర్ తరపు న్యాయవాది చీఫ్ జస్టిస్ అలోక్ అరుదయ్ బెంచ్‌ను ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్‌ను తక్షణమే విచారించే ఎమర్జెన్సీ లేదని, మొదట రిజిస్ట్రీ ద్వారా దీనిని స్పష్టతకు పంపాలని ఆదేశించారు. రిజిస్ట్రీ ఈ పిటిషన్‌ను ఏ బెంచ్‌కు పంపిస్తుందో మరికొద్ది సేపట్లో తేలనుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ విచారించాలని భావిస్తే, 2 గంటల సమయంలో విచారణ జరుగుతుందని భావిస్తున్నారు.
ఫార్ములా ఈ కేసు నేపథ్యంతో రాష్ట్ర రాజకీయాలు రగలుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ కేసును ప్రతిపక్షాల కుట్రగా భావిస్తుండగా, ఏసీబీ తమ దర్యాప్తు ప్రక్రియను ఆచరణలో పెడుతోంది. కేటీఆర్ హైకోర్టులో కేసును కొట్టివేయించుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక కేసీఆర్ అరెస్ట్ అయితే పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పార్టీ నాయకత్వం విషయంలో స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావు అసెంబ్లీలో మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. ఇక మరోవైపు కవిత నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇక కేటీఆర్ కేసు వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.