తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఇంకో ఐదేళ్ళు ప్రతిపక్షంలో వుండాల్సి వచ్చినా.. పెద్దగా ఫరక్ పడదు.! వయసు మీద పడిపోయింది.. రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసేసుకుంటారేమో కూడా.! నారా లోకేష్ సంగతంటారా.? ప్చ్.. పెద్దగా ఈ విషయంలో చంద్రబాబు చేయగలిగిందీ ఏమీ లేదు.!
వాస్తవానికి, తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితిలో వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వెంటిలేటర్ మీదుంది ఆ పార్టీ. జనసేన పొత్తు.. అన్న మాట లేకపోతే, 2019 ఎన్నికల్లో టీడీపీని అస్సలెవరూ పట్టించుకోకపోవచ్చు.
ఇంతకీ, జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి.? పొత్తు వికటిస్తే, 2024 ఎన్నికల తర్వాత జనసేనాని ఏం చేస్తారు.? పాతికేళ్ళ రాజకీయ ప్రస్తానం జనసేన లక్ష్యమంటూ జనసేనాని గట్టిగానే చెబుతుంటారు. మాటలు చెప్పడానికీ, పార్టీని నడపడానికీ చాలా తేడా వుంటుంది.
టీడీపీతో పొత్తు పెట్టుకున్నది, జనసేన పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికే. ఒకవేళ, 2024 ఎన్నికల్లో టీడీపీ షరామామూలుగానే దెబ్బ తింటే, ఆ క్యాడర్ పూర్తిగా జనసేన వైపు వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారేమో.! కానీ, అలా జరగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పొత్తులు రాజకీయాల్లో సహజం. దాన్ని తప్పు పట్టడానికి లేదు.! కానీ, టీడీపీకి పవన్ కళ్యాణ్ ‘సమర్పించేసుకుంటున్న వైనం’ జనసైనికులకీ మింగుడుపడ్డంలేదు. ఈ క్రమంలోనే, పొత్తులు ఎన్నికల్లో బెడిసి కొడితే, పవన్ కళ్యాణ్‌కి రాజకీయ భవిష్యత్తు వుండదని జనసైనికులు భయపడుతున్నారు.
కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అధినేతను కంట్రోల్ చేసే పరిస్థితి జనసేనలో ఎవరికీ లేదు.