ప్రతీ ఏటా క్రిస్మస్ పండగ సీజన్ బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి కొంచెం తేడాగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల హడావిడి లేకపోవడం, విడుదలైన సినిమాలపై తక్కువ అంచనాలు ఉండటంతో క్రిస్మస్ కాలక్షేపం అంతగా కిక్ అయితే ఇవ్వలేదు. నితిన్ రాబిన్ హుడ్, నాగచైతన్య తండేల్ లాంటి భారీ అంచనాల సినిమాలు వాయిదా పడటం ఇందుకు ప్రధాన కారణం.
గత వారం అల్లరి నరేష్ బచ్చల మల్లి మంచి అంచనాల మధ్య విడుదలైంది. నరేష్ నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నప్పటికీ, సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కోలీవుడ్ డబ్బింగ్ చిత్రం విడుదల-2, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన యూఐ చిత్రం మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంటోంది. ఈ సినిమాలకు పెద్దగా రీచ్ లేకపోవడం ఈ సీజన్ ఆకర్షణను తగ్గించింది.
క్రిస్మస్ రోజున మూడు చిత్రాలు విడుదలయ్యాయి. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మంచి పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది. థియేటర్లలో వినోదం పంచుతూనే, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. మరోవైపు మోహన్ లాల్ బరోజ్, కిచ్చా సుదీప్ మ్యాక్స్ లాంటి డబ్బింగ్ చిత్రాలు పెద్దగా హైప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొత్తానికి, ఈ సారి క్రిస్మస్ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మాత్రం అందరిని ఆకర్షించేలా ఉంది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఈ చిత్రం మరింత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది. మరి, ఈ సీజన్ పూర్తి కావడానికి ముందే పరిస్థితులు మారుతాయో లేదో చూడాలి.