అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతుల చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని… తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆ సమస్య కూడా పూర్తయిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో అంచనాలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు గోదావరి జిల్లాలో పర్యటించడం మొదలుపెట్టారు. ఒకరితర్వాత ఒకరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతులు చెప్పిన విషయాలు విన్నారు.. వారి నుంచి కొన్ని రైతు సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. చంద్రబాబైతే ప్రభుత్వానికి అల్టిమేట్టం జారీ చేయగా.. జనసేనాని అయితే… సమస్య పరిష్కారమయ్యే వరకూ జనసేన తూర్పు గోదావరి జిల్లాలోనే ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు.. జగన్ ని ఫ్యూచర్ గురించి చెబుతూ హెచ్చరించారు! దీంతో… గతం గుర్తుచేసుకున్న బాబు… జగన్ ను అలర్ట్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన రేపు పెను ఉప్పెన అవుతుందని.. అందులో ప్రభుత్వం కొట్టుకుపోతుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే జరిగేదదేనని అన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు పతనమైపోయాయని గుర్తుచేశారు. దీంతో… 2014 ఎన్నికల హామీలు, అవి నమ్మిన రైతులు వేసిన ఓట్లు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలకు బాబు పొడిచిన తూట్లు గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు.
ఉదాహరణకు.. రైతు రుణమాఫీ. ఒకేసారి రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి… ఆ హామీకి బాబు హ్యాండ్ ఇచ్చారు. ఫలితంగా ఆ సమస్య నిన్నమొన్నటివరకూ కూడా రైతులు ఎదుర్కొన్న పరిస్థితి. ఇదే సమయంలో… రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీని కూడా తన హయాంలో బాబు ఎత్తేశారు. రుణమాఫీ గురించి అడిగిన విలేఖరులతో… అది ముగిసిన అధ్యాయం అని చెప్పుకొచ్చారు! దీంతో… 2019 ఎన్నికల్లో బాబు అడ్రస్ ను గల్లంతు చేసినంతపని చేశారు రైతులు.
దీంతో… గతం తలచుకుని ఆవేదన చెందుతున్న చంద్రబాబు మాటలు పైకి హెచ్చరికలుగా, శాపనార్థాలుగా అనిపిస్తున్నా… అందులో జగన్ ని అలర్ట్ చేస్తున్న అంశం కూడా దాగిఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో సీనియర్ పొలిటీషియన్ హెచ్చరికలను జగన్ పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాగా… అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని జగన్ ఆదేశిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయని చెబుతున్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్!