Sandhya Theatre Incident: సంధ్య థియేటర్ ఘటనపై దిల్ రాజు ఫస్ట్ రియాక్షన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఈరోజు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, వైద్యుల నుంచి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, రేవతి మృతితో తాను ఆవేదన చెందానని, ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేయాలని చిత్ర పరిశ్రమ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రత్యేకంగా రేవతి భర్త భాస్కర్‌కు చిత్ర పరిశ్రమలో శాశ్వత ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన ఎవరి తప్పుతోనూ జరగలేదని, ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిందని అభిప్రాయపడ్డారు.

సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటారని దిల్ రాజు పేర్కొన్నారు. అయితే, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పరిశ్రమ పెద్దల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రేపు లేదా ఎల్లుండి సీఎంను కలిసి అన్ని అంశాలపై చర్చిస్తానని, ప్రభుత్వాన్ని, పరిశ్రమను సమన్వయం చేయడంలో తన పూర్తి బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ సహా చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చలు నిర్వహించనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా రేవతి కుటుంబానికి మరింత సహాయం అందించే చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో శ్రీతేజ్ వేగంగా కోలుకుంటున్నాడని, అతడి ఆరోగ్యానికి ఎలాంటి అవరోధాలు రాకుండా చూసేందుకు వైద్యులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు.