RGV : టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో వరుసగా ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తరచూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు వర్మ. కొన్ని కొన్ని సార్లు సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు రాంగోపాల్ వర్మ. కాగా వర్మ కి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం అనే సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసి వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేశారు. అప్పటి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వ్యూహం సినిమాకు ఆర్జీవి ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ఇటీవలే నోటీసులు కూడా పంపారు.
అయితే దీని గురించి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాకు గాను ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్లు ఆర్జీవికి ఇచ్చారు. సాధారణంగా ఒక్కో వ్యూకి 100 రూపాయలు ఇస్తాము. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కన ఈ సినిమాకు ఒక్కో వ్యూకు 11 వేల రూపాయలు ఇచ్చారని దానిపై వివరణ కోరుతూ ఆర్జీవికి లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. అయితే ఆర్జీవీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజుల్లోగా వ్యూహం సినిమాకి తప్పుడు మార్గంలో తీసుకున్న డబ్బులు ఆర్జీవీ తిరిగి చెల్లించాలి. లేకపోతే రామ్ గోపాల్ వర్మ మీద క్రిమినల్ కేసు పెడతాము.
ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం. రామ్ గోపాల్ వర్మకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము. 15 రోజుల్లోగా డబ్బు తిరిగి చెల్లించాలని నోటీసులో తెలిపాము అని చైర్మన్ చెప్పుకొచ్చారు. ఫైబర్ నెట్ లో విడుదల చేసిన వ్యూహం సినిమాకి 1863 వ్యూస్ వస్తే కోటిన్నర రూపాయలు ఎలాంటి అప్రూవల్ లేకుండా అగ్రిమెంట్ చేసుకోని ఇచ్చారు. సినిమా చూసినా చూడకపోయినా రెండు కోట్లు చెల్లించేలాగా ఫేక్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు లోకేష్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా తీశారు కాబట్టే అప్పటి ప్రభుత్వం వ్యూహం సినిమాకి ఫేవర్ చేసింది అని అన్నారు. చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు వ్యవహారంలో కూడా ఫైబర్ నెట్ ద్వారా వెళ్లిన ఫైల్స్ అన్నిటి మీద విచారణ జరుగుతుంది. దాంట్లో ఎవరి పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదు అని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. మరి ఈ విషయంపై రాంగోపాల్ వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.