సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారాలను మొదలుపెట్టేశాయి. ప్రధానంగా వైసీపీ – టీడీపీ నేతలు జనాల్లో తిరుగుతున్నారు. పవన్ ఇప్పటికీ ఫంక్షన్ హాల్స్ లోనే మీటింగ్లు పెడుతున్నారు. త్వరలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటులో సమస్యలు తప్పవని కథనాలొస్తున్న వేళ… టీడీపీలో అంతర్గతంగా టిక్కెట్ల లొల్లి పీక్స్ కి చేరింది. టిక్కెట్ నాకంటే నాకంటూ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అది ఎంతలా అంటే… పార్టీ జెండాలు తగులబెట్టేంతలా!
వాస్తవానికి జనసేనతో పొత్తు అన్నప్పుడే టిక్కెట్ల విషయంలో తమ్ముళ్ల అలకలు తప్పవని చాలా మంది భావించారు. అయితే వారిని చంద్రబాబు నయానో భయానొ సైలంట్ చేస్తారని తలంచారు. అయితే ఇప్పుడు జనసేనతో సమస్య ఇంకా తెరపైకి పూర్తిగా రాలేదు కానీ… టీడీపీ నేతలు మాత్రం వారికి వారే నిప్పులు పెట్టేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్ లో ఫుల్ కన్ ఫ్యూజన్ సృష్టిస్తున్నారు.
దీంతో టీడీపీలో అంతర్గత సమస్యలు ఇప్పటి నుంచి మొదలయ్యాయని.. అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇవి తారాస్థాయిలో ఉండే ప్రమాదం ఉందని.. చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. పైగా ఈ నెల 25న టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్న నేపథ్యంలో… బాబు & కో తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో మొదటికే మోసం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుత విషయానికొస్తే… రాయచోటి టీడీపీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ టికెట్ ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించారంటూ వార్తలు గుప్పుమనడంతో… నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. ఇందులో భాగంగా… రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రకటించారు.
ఇదే సమయంలో… ఇదే టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి కూడా… రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగాంగా శుక్రవారం అర్ధరాత్రి లక్కిరెడ్డిపల్లి చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ జెండాలకు నిప్పు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్టర్లను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలూ చేశారు.
ఇలా ముగ్గురు మధ్య రచ్చ రంబోలా అవుతున్న దశలో నాలుగో పేరు కూడా తెరపైకి వచ్చింది. అదే… సుగవాసి ప్రసాద్ బాబు! దీంతో… ఈ నలుగురిలో చంద్రబాబు టిక్కెట్ ఎవరికి ఇస్తారు అనేది తీవ్ర ఆసక్తిగా మారింది. వీరిలో ఎవరికి టిక్కెట్ కన్ ఫాం చేసినా మిగిలిన ముగ్గురూ సరిపోతారు పార్టీని ఓడించడానికి.. ప్రత్యర్థులు అవసరం లేదనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో బాబు తీసుకునే నిర్ణయంపై కేడర్ కు టెన్షన్ పెరిగిపోతుందని చెబుతున్నారు.