TG: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన గురువారం బెయిల్ మీద బయటకు వచ్చారు.. లగచర్ల గ్రామ ఘటనలో భాగంగా అధికారులపై జరిగిన దాడి కేసులో భాగంగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు ఇలా ఇన్ని రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన ఇటీవల బెయిలు మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం జైలు నుంచి బయటకు వచ్చినా నరేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ వ్యవహార శైలిని తప్పు పట్టడమే కాకుండా ఆయనకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ పతనం కొడంగల్ నుంచి ప్రారంభమైందని తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ లో గ్రామసభ ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. ఈ గ్రామ సభలోనే ఎన్నికల హామీల గురించి చర్చిద్దామని తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం ఫెయిల్యూర్ అయ్యారని ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు చెప్పడం తప్ప.. చేతలు ఏం ఉండవని ఎద్దేవా చేశారు. హామీల అమలుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈయన డిమాండ్ చేశారు.
లగచర్ల గ్రామ ఘటనలో భాగంగా నాపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఈ విషయంలో కేటీఆర్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం పట్ల నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డికి పోటీగా నరేందర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణలో భాగంగా పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు అధికారులపై దాడి చేయగా ఈ దాడి వెనుక నరేందర్ రెడ్డి హస్తం ఉందని పోలీసులు ఈయనని అరెస్టు చేశారు.