స్కిల్ డవలప్మెంట్ స్కాం కేసులో జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జైలు నుంచి నిర్ధోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ గంటా శ్రీనివాసరావు వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. సినీ జనాలు, జూనియర్ ఎన్టీఆర్ తీరుపట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఏకమవుతున్నారని చెప్పిన గంటా శ్రీనివాస రావు… అందులో భాగంగానే హైదరాబాద్, బెంగుళూరుల్లో ఐటీ ఉద్యోగులు కృతజ్ఞతతో మద్దతిస్తున్నారని, విదేశాలనుంచి కూడా చంద్రబాబుకు మద్దతు లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ టీడీపీతో కలిసిరావడం శుభపరిణామం అని అన్నారు.
ఈ క్రమంలో సుమారు పదహారు నెలలు జైల్లో వున్న జగన్ శాడిజంతోనే చంద్రబాబును జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్మెంట్ కేసును పైకి తెచ్చి చంద్రబాబుపై కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. స్కిల్ డవలప్మెంట్ సెంటర్ కు తాను వెళ్లాలని చూస్తే అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో… చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్ కొరిమితో తల గోక్కున్నట్లయ్యిందని చెప్పిన గంటా… బాబుకు ఏ చిన్న ప్రమాదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి ఊహించిన స్థాయిలో స్పందన రాని విషయంపైనా గంటా స్పందించారు. జగన్ కు భయపడి పైకి చెప్పలేకపోయినా… సినిమా ఇండస్ట్రీ జనాలందరూ చంద్రబాబు క్షేమం కోరుకునేవారేనని అన్నారు. రజనీకాంత్, అశ్వినీదత్, రాఘవేంద్రరావు స్పందించారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్… చంద్రబాబు అరెస్ట్ పై స్పందించని విషయంపైనా గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… స్పందించకపోవడం జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతం అని అన్నారు. ఇదే కాదు.. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా హాజరు కాలేదని చెప్పారు. ఆయన చాలా కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారు.
కాగా… జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు వాడుకుని వదిలేస్తున్నారని నందమూరి అభిమానులు ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తుంటారు ఆయన అభిమానులు. దీంతో… జూనియర్ ఫోటోలు చూడగానే బీపీ వచ్చేస్తాదో ఏమో కానీ… వాళ్లందరినీ ఈడ్చి పారేయమంటూ ఆదేశాలు జారీచేస్తారు.