Jani Master: జానీ మాస్టర్ అరెస్టుకి అల్లు అర్జున్ కారణమా.. కొరియోగ్రాఫర్ యాక్షన్ ఇదే!

Jani Master: ప్రస్తుతం రెండు విషయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. అందులో ఒకటి సంధ్యా థియేటర్ ఘటన కాగా మరొకటి జానీ మాస్టర్ కేసు విషయం. ఈ రెండు విషయాల గురించే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా గాయపడిన శ్రీ తేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీతేజ్ ని చాలా మంది సినీ ప్రముఖులు పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీతో కలిసి హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్ ను పరామర్శించారు.

ఆ చిన్న పిల్లవాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జానీ మాస్టర్ మాట్లాడుతూ.. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతోంది. త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాబు కదులుతున్నాడు, వినిపిస్తుంది, చూస్తున్నాడు. కదలికలు చాలా బాగున్నాయి. అందరు పిల్లల మాదిరిగా త్వరలోనే పిల్లాడు లేచి ఆడుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లాడిని అలా చూడగానే సంతోషంగా అనిపించింది. వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్స్‌ యూనియన్‌ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లుగా పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాలేదు అని విమర్శించడం సరి కాదు. బాబును పరామర్శించాలని అందరికీ ఉన్నా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, ఇతర కారణాల వల్ల రాలేకపోయి ఉంటారు అంతే తప్ప మరే ఉద్దేశ్యం లేదు అంటూ జానీ మాస్టర్ అన్నారు.

అయితే ఇంతలోనే జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్‌ ను కలిశారా అంటూ రిపోర్టర్‌ ప్రశ్నించిన సమయంలో జానీ మాస్టర్‌ రియాక్ట్ అయ్యారు. బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతో సమయం స్పెండ్‌ చేస్తున్నాను. కొన్ని పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే పనిలో ఉన్నాను. కనుక అల్లు అర్జున్‌ ను కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్‌కి అల్లు అర్జున్‌ కారణం అనే పుకార్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. వాటిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో థాంక్యూ సో మచ్‌, జై హింద్‌ అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంత వరకు కరెక్ట్‌ అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఒకవేళ మీరు అన్నట్టు జానీ మాస్టర్ అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమైతే ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ను ఎందుకు పరామర్శిస్తారు అనవసరంగా లేనిపోని సృష్టించకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.