సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ నటుడు రవికిషన్ ఈ సమస్యపై ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న సమస్యలను గురించి మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు.
రవికిషన్ మాట్లాడుతూ, సినిమా రంగంలో అడుగుపెట్టే ముందు తమ కుటుంబం పేదరికంలో ఉందని, వారి బతుకుబండిని నడిపేందుకు సినీ ఇండస్ట్రీలో ప్రవేశించాల్సి వచ్చిందని చెప్పారు. “ముంబైకి వచ్చిన తరువాత ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. డబ్బు లేకపోతే చాలు, కొందరు మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. ఇది కేవలం సినిమా ఫీల్డ్‌లోనే కాదు, ఏ రంగంలో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను. కానీ ఎక్కడ తలవంచ లేదు” అని తెలిపారు.
ఇంకా రవికిషన్ మాట్లాడుతూ, చిన్నతనంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగినట్లు తెలిపారు. “విజయం కోసం షార్ట్ కట్స్ ఎంచుకున్న వారిని నేను చూసాను. వారిలో కొందరు తీవ్రంగా బాధపడి, మరికొందరు చెడు అలవాట్లకు బానిసలయ్యారు. కొందరు ప్రాణాలకే తెగించారు,” అని ఆయన పేర్కొన్నారు. విజయం సాధించాలంటే కష్టపడటమే మార్గమని, ఓపికతో సమయం కోసం వేచి ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.
భోజ్ పురి, హిందీ సినిమాల్లో నటించి విపరీతమైన గుర్తింపు పొందిన రవికిషన్, తెలుగులో రేసుగుర్రం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. రవికిషన్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.