200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసిన వాట్సప్ చాట్ పై బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అస్సలు సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని, పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యంలేకే తనపై దాడికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
అవును… ఫేక్ చాట్ లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆర్థిక నేరగాడు సుఖేశ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని కవిత చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని.. బీఆరెస్స్ కున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారని కవిత విమర్శించారు. ఓ ఆర్థిక నేరగాడు ఒక అనామిక లేఖను విడుదలచేస్తే… దాన్ని పట్టుకుని కొందరు కావాలని రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసీకి లేఖ రాయడం, బీజేపీ టూల్ కిట్ లో భాగంగానే పనిగట్టుకుని సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ విషయంలో మీడియాపై మండిపడుతున్న కవిత… తనకు సుఖేశ్ ఎవరో తెలియదని, అయినా కూడా ఇవేవి పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకుని తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ఇదివరకు తన మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తర్వాత తోక ముడిచారని కవిత చెప్పుకొచ్చారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని.. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం దురదృష్టకరమని తెలిపారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ… సుఖేశ్ అనేవ్యక్తి చిన్న నేరగాడు కాదు. పైగా అతడు చేస్తున్న ఆరోపణలు చిన్న వ్యక్తులపై కూడా కాదు. అలాంటప్పుడు అతడు తన లాయర్ తో విడుదల చేయించిన విషయాన్ని మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి కవితకు తెలుసో తెలియదో.. అనేది సెకండరీ కదా! మరి కవిత మీడియాని తప్పుపడితే ఎట్లా? ఇప్పుడు సుఖేశ్ అనేవ్యక్తి తనకు తెలియదని చెబుతున్నారు… ఆ వార్తను కూడా మీడియా కవర్ చేసింది కదా!
పైగా… రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు పావుగా మారడం దురదృష్టం అని కవిత చెప్పడంపై పెదవి విరుస్తున్నారు విశ్లేషకులు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై జరిగిన దాడులు, కొన్ని మీడియా సంస్థలను చేతుల్లోకి తీసుకోవడాలు, మరికొన్ని సంస్థలను బ్లాక్ మెయిల్ చేసినట్లు వచ్చిన కథనాలను, జరిగిన వ్యవహారాలను కవిత ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని సూచిస్తున్నారు! మీడియాకు సలహాలు సూచనలు ఇవ్వడం.. మీడియా పనులను తప్పుపట్టడం మాని… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనీ లాండరింగ్ లో పడుతున్న మరకలను క్లియర్ చేసుకోవడంపై శ్రద్ధ పెట్టాలని సలహా ఇస్తున్నారు!!