2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. రాజకీయాలంటేనే అంత.! ఎవరూ ఊహించని వింతలు జరుగుతుంటాయ్.! జనసేనాని రెండు చోట్లా ఓడిపోతే, జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచారు.! అది ఇంకో వింత.!
భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆయన చివరికి ఓడిపోయారు. మళ్లీ భీమవరంలోనే జనసేనాని పోటీ చేస్తారా.? గాజువాక నుంచైనా ఆయన మళ్ళీ పోటీ చేసే అవకాశం వుందా.? అంటే, జనసేన పార్టీ నుంచి సరైన సమాధానం దొరకడంలేదు.
ఇదిలా వుంటే, నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘గెలిచే సీట్లలో పోటీ చేద్దాం. స్ట్రైక్ రేట్ మాత్రం 98 శాతం వుండాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ముఖ్య నేతల్ని ఉద్దేశించి. కొందరు నాయకులకు జనసేన అధినేత నుంచి నేరుగా ఫోన్లు వెళ్ళాయి. ఓ డజను మంది వరకు ఈ ఫోన్లు అందుకున్నారట. వారికి టిక్కెట్లు ఖాయమయ్యాయట కూడా.
రాజకీయాల్లో స్ట్రైక్ రేట్ అనేది ఎవరూ ఊహించలేరు. కామారెడ్డిలో కేసీయార్ ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా.? అలాగే వుంటుంది రాజకీయం.! రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అంచనాలు తల్లకిందులవడం అంతే సహజం.
ఎప్పుడూ 50 – 50 ఛాన్సెస్ మాత్రమే వుంటాయ్. వైసీపీ కూడా, 2019 ఎన్నికల్లో 98 శాతం స్ట్రైక్ రేట్ అనుకుని వుండదు. కానీ, మంచి ఫలితాలొచ్చాయ్. అది అనూహ్యం. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది. చాలా అరుదుగా జరుగుతుంటుందది.
అసలు జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరు.? జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ ఎప్పుడు పద్ధతిగా చేస్తారు.? వీటిపై స్పష్టత లేకుండా 98 శాతం స్ట్రైక్ రేట్ అంటే.. అది పూర్తిగా టీడీపీ మీద నమ్మకం తప్ప, జనసేన సొంత బలం మీద కాదన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జరుగుతుండడం కొసమెరుపు.!