నవరత్నాల అమలులో జగన్ మార్క్ సుస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చెప్పినట్టే సంక్షేమ పథకాలను అమలు చేయడానికి జగన్ పనిచేస్తున్నారు. ఖజానా మీద భారం పడినా, అప్పులు పెరుగుతున్నా వెనుకాడకుండా జనం ఖాతాలోకి నగదు బదిలీ జరుగుతోంది. ఏ నాయకుడూ చేయని తరహాలో కేవలం ఒక్క సంవత్సరం పాలనలో రూ.40,000 కోట్లను 3.9 కోట్ల మంది ప్రజలకు పంచారు. ఇంకా మిగిలి ఉన్న పథకాల అమలుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి. మొత్తానికి ఏపీలో సంక్షేమం నిరాటంకంగా, అందరూ గొప్పగా చెప్పుకునేలా జరుగుతోంది. ఈ మాటలన్నీ నిజమే.. వినడానికి బాగానే ఉన్నాయి. కానీ మరొక కీలకమైన అంశం అభివృద్ది మాటేమిటంటే చేతులు తిప్పేసే పరిస్థితి.
Read More : తెల్ల రంగుపై జగన్ బొమ్మ..ఇది ఫిక్స్
ఏ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా అభివృద్ది తప్పనిసరి. ప్రస్తుత కాలంలో అభివృద్ది జరిగితే తరవాతి తరాలు బాగుంటాయి. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సిన దీన స్థితి ప్రజలకు ఉండదు. అందుకే దార్శనికత కలిగిన ఏ నాయకుడైనా చెప్పే మాట అభివృద్ది ముఖ్యం అని. అభివృద్దితో పాటే వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమం కూడా ఉండాలంటారు. కానీ మన రాష్ట్రంలో సంక్షేమం నాలుగు పాదాల మీద అభివృద్ది ఒక్క పాదం మీద నడుస్తోంది. గత 2019-20 రూ.2,27,975 కోట్లు కాగా అందులో ఖర్చు పెట్టింది మాత్రం రూ.1.74 లక్షల కోట్లు మాత్రమే. అంటే అంచనాలకు, సవరణలకు తేడా రూ.53,000 కోట్ల పైమాటే. ఇక 2020-21కి గాను బడ్జెట్ రూ.2,24,789.19 కోట్లు. గతేడాది కంటే రూ.3,186 కోట్లు తక్కువ. మరి అంచనాలకు, సవరణలకు ఎంత తేడా ఉంటుందో చెప్పలేం. కానీ గతేడాది కంటే కొంచెం ఎక్కువే ఉంటుందని మాత్రం అంచనా వేయవచ్చు.
ఎందుకంటే ఆదాయ వనరుల లోటు. గత ఆర్థిక సంవత్సరంలో భారీగా కాకపోయినా ఒక మోస్తారుగా రాష్ట్ర ఆదాయం ఉండటంతో ప్రభుత్వం వాస్తవ బడ్జెట్లో రూ.1.74 లక్షల కోట్లను ఖర్చు చేయగలిగింది. కానీ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా ఆదాయానికి భారీగా గండి పడింది. ఇలాంటి స్థితిలో తేడా ఎక్కువగానే ఉండటం అనివార్యం. గతేడాది బడ్జెట్లో సంక్షేమం వాటా 6.2 శాతం ఉంటే అది ఈ యేడాది 18.44 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయాన్ని దాదాపు 1.62 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కానీ ఆర్థిక మందగమనం కారణంగా 1.62 లక్షల కోట్ల టార్గెట్ చేరుకోవాలంటే రూ.60,000 కోట్ల వరకు అప్పు చేయాలి.
Read More : మెగాస్టార్‌తో త్రివిక్రమ్ మూవీ 2022లోనే
ఈ రెవెన్యూ ఆదాయంలో కేంద్రం నుండి రూ.53,000 కోట్ల వరకు సహాయం అందుతుందని ఆశలు పెట్టుకుని ఉంది మన ప్రభుత్వం. కానీ గత యేడాదే రూ.21.8 వేల కోట్లు మాత్రమే సహాయం చేసిన కేంద్రం కరోనా కష్టాల నేపథ్యంలో ఈసారి ఆ సహాయమైనా చేస్తుందా అనేది నమ్మకం లేని విషయం. సో అక్కడ కూడా నిరాశే. అంటే వచ్చే అరకొర ఆదాయం మొత్తం సంక్షేమ పథకాల అమలుకే సరిపోతుంది. నిజానికి అది కూడా చాలదు. అందుకే సర్కార్ మద్యం రేట్లను విపరీతంగా పెంచడం, ప్రభుత్వ ఆస్తుల విక్రయం లాంటి చర్యలకు పూనుకుంది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది కార్యక్రమాలు ప్రప్రొజల్స్ వరకే పరిమితం అవుతాయి కానీ పట్టాలెక్కే పరిస్థితి అయితే లేదు. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న రూ.3.489 లక్షల కోట్ల అప్పుల భారం రానున్న నాలుగేళ్లలో ఏ స్థాయికి చేరుకుంటుందో అంచనా వేస్తే ధరల పెంపులతో సామాన్యుడి నడ్డి పలుమార్లు విరగడం ఖాయం.
ఈ లెక్కలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనివి కావు. కానీ తెలిసి కూడా అభివృద్దిని పక్కనబెట్టి సంక్షేమం పేరుతో ప్రజల ఖాతాల్లోకి వేలల్లో డబ్బు జమచేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఓటు బ్యాంకును కాపాడుకోవడం. పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసిన డబ్బునే పథకాల రూపంలోకి మార్చి తిరిగి ప్రజలకే ఇస్తోంది. ఈ పద్దతి తర్వాతి దఫాలో వైకాపాకు అధికారం దక్కించుకోవడంలో బ్రహ్మాండంగా పనిచేయడంతో పాటు రాష్ట్ర భవితవ్యాన్ని కష్టాల్లోకి కూడా నెడుతుంది. ఇక ఈ పథకాల నుండి లబ్ది పొందుతున్న వారిలో కొంత మంది మరి అభివృద్ది మాటేమిటని స్వీయ ప్రశ్నలు వేసుకుంటున్నారు తప్ప మెజారిటీ శాతం మంది మాత్రం ప్రభుత్వ చర్యలు భేష్ అనుకుంటున్నారు తప్ప పరిధులు దాటి ప్రశ్నార్థకం కాబోతున్న భవిష్యత్తు గురించి మాత్రం ఆందోళన చెందలేకపోతున్నారు.